అసలేంటి గ్రూప్-1 గోల..! అశోక్ నగర్ లో అసలు ఏం జరుగుతుంది..?

Chakravarthi Kalyan
చాలామందిని ఆశ్చర్యపరుస్తున్న విషయం ఒకటుంది. అదేమిటంటే గ్రూప్-1,2 పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులు ఆందోళనలు చేయాలంటే అశోకనగర్ అడ్డాగా పాపులరైపోయింది  గ్రూప్స్ అభ్యర్ధుల ఆందోళనలకు ప్రభుత్వమే షేకైపోతోంది.  ప్రతిపక్షాలు తప్పనిస్ధితిలో వీళ్ళకు మద్దతుగా నిలవాల్సొస్తోంది. దీనికి కారణం ఏమిటంటే చాలా సింపుల్ నిముషాల వ్యవధిలోనే వేలదిమంది జమైపోవటం.


ఇంత తొందరగా అన్ని వేలమంది ఎలా అశోక్ నగర్లో జమవుతున్నారు ? పగటిపూట జమవుతున్నారంటే అర్ధముంది. కాని చాలాసార్లు అర్ధరాత్రుళ్ళు కూడా వేలాదిమంది ఎలా ఒకచోట చేరుతున్నారు ? దీనికి కారణం ఏమిటంటే అశోక్ నగర్ గ్రూప్-1,2 పరీక్షలు రాసే అభ్యర్ధుల కోచింగ్ సెంటర్లకు బాగా పేరుపడింది. చిన్నా, పెద్దా కోచింగ్ సెంటర్లు అశోక్ నగర్లో సుమారు 150 దాకా ఉన్నాయి. ఒక్కో సెంటర్లో తక్కువలో తక్కువ 400 మంది కోచింగ్ తీసుకుంటుంటారు.


కోచింగ్ సెంటర్లలో చదువుతున్న వాళ్ళు కాకుండ చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీకి గ్రూప్స్ పరీక్షల మెటీరియల్ చదువుకునేందుకు ప్రతిరోజు కొన్ని వందలమంది వస్తుంటారు. గ్రూప్-1,2 కోచింగ్ విద్యార్ధులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి యూపీఎస్సీ రాసే విద్యార్ధులు కూడా కొన్ని వేలమంది ఉంటారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతునే గ్రూప్-1 పరీక్షలు రాసే విద్యార్ధులు వేలల్లో ఉంటారు.


యూపీఎస్సీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సెంటర్లు కూడా చాలానే ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే పరీక్షల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉన్నాయని అభ్యర్ధులు అనుకుంటే, ఆందోళనలు చేయాలని నిర్ణయిస్తే ఒకచోట కలవటం వీళ్ళకు చాలా తేలికవుతోంది. బయటప్రాంతాల నుండి వచ్చే అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి, ఎంజీబీఎస్ నుండి అశోక్ నగర్ చేరుకోవటం చాలా తేలిక. పైగా గ్రూప్స్ పరీక్షలు రాసేవారికి ఎలాగూ మొబైల్ ఫోన్లుంటాయనటంలో సందేహంలేదు. కాబట్టి సమాచారం ఇచ్చిపుచ్చుకోవటం కూడా ఈజీ అయిపోయింది.


వాట్సప్, టెలిగ్రామ్ యాప్ ద్వారా గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవటం, మెసేజీలు పంపుకోవటం తేలికైపోయింది. దాంతో ఏ సమాచారమైనా నిముషాల్లో అభ్యర్ధుల మధ్య చాలా తేలికగా సర్క్యలేట్ అయిపోతోంది. సమాచారం అందటమే ఆలస్యం నిముషాల వ్యవధిలో కొన్నివేలమంది ముందుగా నిర్ణయించుకున్న సెంటర్ దగ్గరకు చేరుకునేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: