ఏంటి, మద్యం షాపు పెట్టడానికి ఎమ్మెల్యేలను కలవాలా? ఇదెక్కడి చోద్యం బాబు?
లాటరీలో లిక్కర్ షాపులని సొంతం చేసుకొనే క్రమంలో జనాలు సంబరాలు చేసుకుంటుంటే, అంత త్వరగా సంతోషపడటం సరి కాదని.. స్థానిక ఎమ్మెల్యే అభయ హస్తం కూడా అవసరమన్న విషయాన్ని ఎక్సైజ్ అధికారులు నొక్కి చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో అయితే ఈ తరహా పరిస్థితి లేదన్న మాట చాలా బలంగా వినిపిస్తోంది. అవును, నియామక పత్రాలు ఇచ్చే సమయంలో మద్యం షాపుల్ని సొంతం చేసుకున్న యజమానులకు ఎక్సైజ్ పోలీసులు తమదైన శైలిలో ఇస్తున్న కౌన్సెలింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇపుడు మారింది.
అధికారులు.. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారా? అన్న ప్రశ్న పదే పదే అడగటం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జోక్యం చేసుకోకుండా ఉండేందుకు కనీసం 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందనే గుసగుసలు వినబడుతున్నాయి. అలాంటి కమిట్ మెంట్ ఏమీ లేకుండా షాపులు ఓపెన్ చేస్తే.. సాఫీగా వ్యాపారం చేసుకోవటం సాధ్యం కాదన్న మాటను స్థానిక ఎమ్మెల్యేలకు చెందిన కొంతమంది స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కొత్త మాటదెబ్బకు లాటరీలో షాపుల్ని దక్కించుకున్న వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఇదేం దందా? సామీ అంటూ పలువురు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట కూడా వినిపిస్తోంది.