డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతులకు బహు బాగు..!
- సాగు పెరిగిన రైతుల్లో భయం పోవడం లేదు..
- సబ్సిడీ అందించిన నమ్మని రైతులు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, వంటి పంటలు మాత్రమే వేస్తూ ఉంటారు. ఇవి రెగ్యులర్ గా వేసే పంటలు కాబట్టి మార్కెట్లో అంతగా డిమాండ్ ఉండదు. దీంతో పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా రైతులకు లాభాలు రాకపోవడంతో రైతులు అంతగా డెవలప్ అవ్వడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరి పంట వేస్తున్నారు. దీనివల్ల పంట కొనుగోలు చేయడం కూడా ప్రభుత్వానికి కష్టంగా మారింది. అలాంటి తరుణంలో ఆరుతడి పంటల కోసం ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్ సాగు. అలాంటి ఈ పంట వల్ల అత్యధిక లాభాలు వస్తాయి. కానీ ఈ పంట పండించే విధానం దానివల్ల వచ్చే లాభాల గురించి రైతులకు అంతగా తెలియడం లేదు. మరి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఎంత పెట్టుబడి ఉంటుంది ఎంత లాభం వస్తుంది.. మార్కెటింగ్ ఉంటుందా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
డ్రాగన్ సాగు మెలకువలు:
ప్రస్తుత కాలంలో చాలా మంది రైతులు ప్రయోగాత్మకంగా సాంప్రదాయ పంటలపై మొగ్గు చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వంటి తదితర పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ ఫ్రూట్ లో ఎక్కువగా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉండడంతో మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో చాలామంది రైతులు వరి మొక్కజొన్న పంటలతో పాటు ఇంకాస్త భూముల్లో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగిచేసి లాభాలు పొందుతున్నారు. అలా లాభాలు వచ్చిన తర్వాత మిగతా పొలం అంతా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూన్నారని చెప్పవచ్చు. ఈ ఫ్రూట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎరుపు రంగు, మరోటి తెలుపు రంగు. ఇందులో గులాబీ రంగులో ఉండే పండు టేస్ట్ గా ఉంటుంది. ఇది క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం మెగ్నీషియం ఫైబర్ వంటి ఎన్నో గుణాలు కలిగిన పోషకాలు ఉంటాయి. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నీళ్లు కూడా తక్కువగా అవసరం అవుతాయి. అలాగే వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇతర పంటల లాగా చీడపీడల సమస్య ఉండదు. అయితే ఈ మొక్క ఒక్కసారి నాటితే 25 నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుంది. ఒక్క మొక్క ధర 50 నుంచి 70 వరకు ఉంటుంది. అలాంటి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను ఎకరానికి 600 నుంచి 700 మొక్కలు పెట్టుకోవచ్చు. అలా ఒక ఎకరంలో దాదాపు లక్ష నుంచి 1,50,000 ఖర్చు వస్తుంది. అలా మొదటి సంవత్సరం మాత్రమే ఖర్చుతో పాటు తక్కువ లాభం ఉంటుంది. కానీ రెండవ సంవత్సరం నుంచి ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఎకరాకు కనీసం ఏడాదికి 2 లక్షల పైగా లాభాలను పొందవచ్చు.
ప్రభుత్వ సహాయం :
డ్రాగన్ ఫ్రూట్ కు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పంటసాయం అందిస్తోంది. సాయాన్ని విడతలవారీగా అందిస్తూ రైతులకు ఎంతో సహకరిస్తుంది. కానీ పంట పండిన తర్వాత మార్కెటింగ్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంది. అలాంటి ఈ తరుణంలో ప్రభుత్వమే డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తే మాత్రం రైతులకు మరింత మేలు కలుగుతుందని అంటున్నారు.