తెలంగాణ రాజకీయాలలో యువ నేతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో పాల్వాయి హరీష్ బాబు ఒకరు. ఈయన తన తల్లితండ్రులు పాల్వాయి పురుషోత్తమ రావు , పాల్వాయి రాజ్యలక్ష్మి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2018 మే నెలలో నియోజకవర్గంలో బెజ్జూరు మండలం రెబ్బెన పంచాయతీ పరిధిలోని లుంబినీ నగర్ నుండి ప్రారంభించి 600 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టాడు. ఆయన 2018 ఆగష్టులో కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓడిపోయాడు.
హరీష్ 2021 లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీజేపీ లో చేరాడు. ఆ తర్వాత నెలలో పెంచికలేపేట్ మండలం కొండపల్లి పోడు రైతుల పక్షాన పోరాడి 40 రోజుల జైలు జీవితం అనుభవించాడు. ఆయన 2022 లో ప్రాణహిత ప్రాజెక్టు సాధన కోసం 75 కిలోమీటర్ల పాదయాత్ర ను కూడా చేపట్టాడు. హరీష్ 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం , ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించింది.
ఆ తర్వాత డిసెంబర్ 14 న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయిన అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు. హరీష్ బాబును 2024 లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది. ఆయనను ఆ తర్వాత బీజేపీ శాసనసభ చీఫ్ విప్‌గా నియమించింది. పోరాడి ప్రజల పక్షాన నిలబడి రెండవ ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన హరీష్ బాబు ప్రస్తుతం కూడా ప్రజల పక్షాన నిలబడుతూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.