తెలంగాణ కేబినెట్లో కొత్త మంత్రులు... ట్విస్టులు..?
మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకోవచ్చు. అయితే ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను ఒకేసారి భర్తీ చేయాలనే అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉంచడం వల్ల ఆ పదవుల కోసం పైరవీలు జరిగితే అనవసర వివాదాలు తలెత్తుతాయి. అన్న అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తవుతుంది. అయినా పూర్తిస్థాయి క్యాబినెట్‌ను ఏర్పాటు చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి.
పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేస్తే పరిపాలనపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో తీసుకుంటారా అనే సందేహాలకు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ మారిన వారికి ఛాన్స్ లేదని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో ఆరు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉంది.
ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. క్యాబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి రెండు పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్క పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం క్యాబినెట్ విస్తరణలో ఎలాంటి అసంతృప్తులకు తావు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.