వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ తో పార్టీకి ఇబ్బందేనా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేసిన వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. మంగళగిరి పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
12 బృందాల పోలీసులు వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, తలశిల రఘురాం, మరి కొందరు నేతల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. హైకోర్టు ముందస్తు బెయిల్ కు నిరాకరించిన నేపథ్యంలో టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన నేతలంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం అందుతోంది. మరోవైపు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు గురువారం సాయంత్రం మంగళగిరి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి సురేశ్ కు రెండు వారాల రిమాండ్ విధించారు.
 
మరి కాసేపట్లో పోలీసులు నందిగం సురేశ్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారని సమాచారం అందుతోంది. వరుసగా నేతల అరెస్ట్ నేపథ్యంలో జగన్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
 
బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచేందుకు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. వైసీపీ ఈ షాకుల నుంచి కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారని సమాచారం అందుతోంది. విచారణలో పోలీసులు లేళ్ల అప్పిరెడ్డి నుంచి ఎలాంటి నిజాలు రాబడతారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: