ఓటుకి నోటు కేసు ముగిసిపోయిందా?

Chakravarthi Kalyan

న్యాయ స్థానాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వరస ఉపశమనాలు కలుగుతున్నాయి. ప్రధానంగా ఓటుకి నోటు కేసులో చంద్రబాబుని ఇరికించాలని తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. న్యాయ స్థానాల్లో పిటిషన్లు రద్దు అవుతున్నాయి.


తిరస్కరణకు గురి అవుతున్నాయి. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్‌ రెడ్డి సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. కానీ దానిని కోర్టు తిరస్కరించింది. కొద్ది రోజుల క్రితం మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి సైతం సుప్రీం కోర్టు లో ఇలాంటి ఎదురు దెబ్బే తగిలింది. ఈ కేసులో చంద్రబాబుని పేరును జత చేస్తూ కొత్తగా విచారణ చేపట్టాలని ఒక పిటిషన్, కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.


ఈ రెండు పిటిషన్లు రాజకీయ దురుద్దేశంతో వేసినవేనని భావించిన సుప్రీం కోర్టు వీటిని కొట్టి వేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయ స్థానాలు వేదికలు కాకూడదని హితవు పలికింది. వాస్తవానికి 2016 నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని ఇరికించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్ లను పరిగణనలోకి తీసుకుని వరుసగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వస్తున్నారు. కానీ చివరగా అత్యున్నత న్యాయస్థానం దానిని తప్పు పట్టింది. ఏకంగా పిటిషన్లనే రద్దు చేసింది.


మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు లు ఇద్దరూ తెలుగు రాష్ట్రాల  సీఎంలుగా ఉన్నారు. ప్రస్తుతం కేసు తెలంగాణలో నడుస్తోంది. దీంతో కేసుపై ఇద్దరి నేతలు ప్రభావం చూపుతారని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. దీంతో ఆ పార్టీ నేత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఏకంగా సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. కేసును తెలంగాణ నుంచి మధ్య ప్రదేశ్ కి మార్చాలని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇద్దరి సీఎంలు అయినంత మాత్రాన కేసును ప్రభావితం చేస్తారా అంటూ ప్రశ్నించింది. ఇలా కేసులను బదిలీ చేసుకుంటూ పోతే ఎలా అంటూ ఆ పిటిషన్ ను కొట్టివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: