వైసీపీలో ఆగ‌ని కాపు వికెట్లు... రోశ‌య్య‌, తోట‌.. క‌న్న‌బాబు ..?

RAMAKRISHNA S.S.
- కాపు టాప్ లీడ‌ర్లు జ‌గ‌న్‌ను న‌మ్మ‌ట్లేదుగా.. !
- రెడ్ల పెత్త‌నంతో ఐదేళ్లు అధికారంలోనూ అవ‌మానాలే
- పార్టీ ఓడిపోయాక కూడా కాపు నేత‌ల‌కు ప్ర‌యార్టీ నిల్‌
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
వైసీపీలో కాపు లీడర్లు పార్టీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో పేరుకు మాత్రమే కాపు నేతలను ముందు పెట్టినా.. తెరవెనక పెత్తనం అంతా రెడ్డి సామాజిక వర్గమే చేసింది. చివరకు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి లాంటి జిల్లాలో సైతం రెడ్డి సామాజిక వర్గ హవా నడిచింది. అలాగే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఇన్చార్జిగా పార్టీ కీలక నేత రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిని నియమించిన జగన్.. అంతా ఆయన కనుసన్న‌ల్లోనే నడిపించారు. టిక్కెట్ల ఎంపిక, పార్టీ ఆర్థిక వ్యవహారాలు, ఎన్నికల్లో అభ్యర్థులకు నిధుల పంపిణీ అంతా మిథున్‌రెడ్డి చెప్పినట్టే జరిగింది.

రెడ్ల పెత్తనంతో ఐదేళ్లు పేరుకు అధికారంలో ఉన్న అన్నమాటే గాని.. వైసీపీ కాపు నేతలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చివరకు పార్టీ ఘోరంగా ఓడిపోయాక కూడా కాపు నేతలకు ప్రయారిటీ ఇవ్వటం లేదు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వరుస‌పెట్టి కీలకంగా ఉన్న కాపు నేతలు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో బలమైన ఉమ్మారెడ్డి ఫ్యామిలీ జగన్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఉమ్మారెడ్డి అల్లుడు.. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఇటీవల ఎన్నికలలో గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయినా.. కిలారు వెంకట రోశ‌య్య‌ వైసీపీకి రాజీనామా చేశారు.

ఉమ్మారెడ్డి ఫ్యామిలీ జగన్ కోసం ఎంతో చేసింది. 2019 ఎన్నికలకు ముందు అప్పటికప్పుడు గుంటూరు పార్లమెంట్ నుంచి కిలారు రోశ‌య్య‌ను  పొన్నూరు అసెంబ్లీకి పంపగా అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. ఇక రోశ‌య్య‌ పార్టీని వీడ‌గా... అదే బాటలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన అడుగులు బీజేపీ వైపు ఉన్నాయంటున్నారు. ఇక అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో మాజీమంత్రి.. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సైతం వైసీపీని వీడాలని మానసికంగా నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆయన చూపులు జనసేన వైపు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా వైసీపీని వీడేందుకు చాలామంది కాపు నేతలు ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: