జగన్ టీటీడీ బోర్డు దుకాణ్ బంద్... బాబోరి టీటీడీ బోర్డు ఇదే?

Suma Kallamadi
చంద్రబాబు సర్కార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పాలకమండలిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం 24 మంది సభ్యులతో కూడిన పాలకమండలిని ఇక్కడ ఏర్పాటు చేయగా తాజా కూటమి ప్రభుత్వం దాని దుకాణ్ బంద్ చేసే పనిలో పడింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి వరకు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా 24 మంది సభ్యులు రాజీనామా చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం వారందరి రాజీనామాలను పరిశీలించి ఆమోదించడం జరిగింది.
ఈ మేరకు దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా.. పాలకమండలి సభ్యులు రాజీనామాలను ఆమోదించడం జరిగింది. దాంతో టీటీడీకి కొత్త ఛైర్మన్‌ను, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించే పనిలో పడింది. దీనికోసం చంద్రబాబు కసరత్తు చేస్తునట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక కొత్తగా ఏర్పాటు కానున్న టీటీడీ బోర్డు సభ్యుల విషయంలో ఇపుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.. ఈ తరుణంలోనే ఇక్కడ కొన్ని పేర్లు సూచాయగా వినబడుతున్నాయి. అందులో ప్రధమంగా వినబడుతున్న పేరు జనసేనాని బ్రదర్ నాగబాబు.. టీటీడీ ఛైర్మన్‌ విధులు ఈయనకి అప్పజెప్పవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీకి అన్నిసమయాల్లో అండగా నిలిచిన ఒక మీడియా సంస్థ అధినేతకు కూడా ఆ అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం ఉంది. అదే సమయంలో బాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే సినీ ప్రముఖు నిర్మాత పేరు తెర మీదకు వచ్చింది.
గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్ గా దర్శకుడు రాఘవేంద్రరావు పని చేయడం జరిగింది. దీంతో, ఈ దర్శకుడికి కూడా అవకాశం దక్కుతుందనే అభిప్రాయం బాగా వినబడుతుంది. అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో క్షత్రిక సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు కాబట్టి అశోక్ గజపతి రాజుకు ప్రతిష్ఠాత్మక టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఇపుడు సర్వత్రా ఆసక్తిగా మారుతోంది.
ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ ఈవో శ్యామలరావు తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై లడ్డూ ప్రసాదాలు అనేవి మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు పాటుపడతాం అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తీసుకున్న తగు జాగ్రత్తల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత గణనీయంగా పెరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి విషయంలో.. తక్కువ నాణ్యత ఉన్న నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD

సంబంధిత వార్తలు: