జగన్‌కు హీరో అయ్యే బంపర్ ఛాన్స్ ఇది... సినిమా సూపర్ హిట్ చేస్తాడా ?
అయితే జగన్ ఈ ధర్నాకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకురావాలని.. తమ పార్టీ నేతలను ఆదేశించారు. ఢిల్లీలో చేపట్టే ధర్నాకు ఇతర పార్టీలకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు అనే చర్చ నడుస్తోంది. ఇతర పార్టీలను ఆహ్వానించి వాళ్ళు ఎవరు ఈ ధర్నాకు రాకపోతే.. వైసీపీ మరింత అభాసు పాలవటం ఖాయం. ఎన్డీయే కూటమి పక్షాలని వైసీపీ ఆహ్వానించలేదు. ఎందుకంటే..? ఆ కూటమి ఏపీలో అధికారం చలాయిస్తోంది. ఇండియా కూటమితో జగన్‌కు మంచి సంబంధాలు లేవు. మరియు ముఖ్యంగా ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ను జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
ఇండియా కూటమిలోని టీఎంసీ, డీఎంకె, శరద్ పవర్ పార్టీలతో జగన్‌కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అయితే బీజేపీతో జగన్ చెట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉండటం వల్ల.. జగన్‌తో ఆ పార్టీలు కలిసి వస్తాయా అంటే కచ్చితంగా రావని చెప్పాలి. అందులోను గతంలో జగన్ బీజేపీతో అంట కాగుతూ దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచిన దాఖలు లేవు. పైగా మోడీకి మద్దతుగానే ఉంటూ తనను తాను కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులను సైతం తీవ్రంగా విమర్శించారు. అందుకే జగన్ చేపట్టే ధర్నాకు ఇతర పార్టీల రాకపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఇతర పార్టీలు కూడా వస్తే జగన్ కచ్చితంగా హీరో అవుతారు అనటంలో సందేహం లేదు.