ఏపీ: భయపడకు... నేనున్నానంటున్న మంత్రి లోకేష్...?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం తన మార్క్ పాలన ప్రారంభించేసింది. ఇందులో భాగంగా మంత్రులు సైతం రంగంలోకి దిగి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజల కష్టాలను తెలుసుకోవడంలో మంత్రి లోకేష్ మరో అడుగు ముందుకేశారు.అరబ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన తెలుగువాళ్లు కష్టాలుపడుతున్నారు. కొందరు అక్కడి పరిస్థితులు, యజమానుల వేధింపులు భరించలేకపోతున్నారు.. మరికొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కువైట్‌లో ఇరుక్కుపోగా.. తన కష్టాలను చెబుతూ వీడియోను విడుదల చేయగా వైరల్ అయ్యింది. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఎంబసీతో పాటూ ఎన్ఆర్ఐలతో మాట్లాడి శివను తిరిగి సొంత ఊరికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఏపీకి చెందిన మరో యువకుడు ఖతార్‌కు చిక్కుకుపోయాడు.. అతడి వీడియో కూడా వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు.అతడికి కూడా అండగా ఉంటామంటూ అభయమిచ్చారు. భయపడొద్దని.. అతనికి తాను సహాయం చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు లోకేష్.

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ స్వస్థలం అంబాజీపేట మండలం ఇసుకపూడి. ఉపాధి కోసం ఏజెంట్ మాటలు నమ్మి ఖతర్ వెళ్లాడు. ఖతర్‌లో మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీరేంద్ర కుమార్ వీసా కోసం ఏజెంట్‌కు రూ.1,70,000 చెల్లించాడు. వీరేంద్రకుమార్ డబ్బులు కట్టడంతో ఖతర్‌కు వీసా ఇప్పించాడు. ఈనెల 10న వీరేంద్ర ఖతర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ వ్యక్తి 11వ తేదీన సౌదీ అరేబియా ఏడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. దీంతో తాను మోసపోయానని వీరేంద్ర గుర్తించాడు. చివరికి తన దగ్గర ఉన్న ఫోన్‌లో వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. దీనిని మిత్రుల సహాయంతో సోషల్ మీడీయా లో పోస్ట్ చేయడంతో నారా లోకేష్ దీనిని చూశారు. వెంటనే స్పందించిన లోకేష్ వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.భయపడాల్సిన అవసరం లేదని, అతనిని తాము తిరిగి ఇంటికి తీసుకొస్తామని ఎక్స్‌ లో పోస్ట్ పెట్టారు. దీంతో వీరేంద్ర కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. మరి వీరేంద్రను ఎన్ని రోజుల్లో తిరిగి తీసుకొస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: