టీడీపీ, వైసీపీ మధ్య వార్ జనసేనకు కనబడడం లేదా?

Suma Kallamadi
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో జనసేన, బీజేపీ భాగస్వాములన్న సంగతి అందరికీ తెలిసినదే. కాగా కూటమి ప్రభుత్వానికి పెద్దన్న పాత్ర పోషిస్తోంది మాత్రం టీడీపీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ అధినేతగా ఇక్కడ చంద్రబాబు ఉన్నారు. పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా నిర్ణయాత్మకమైన వారుగా బాబు కొనసాగుతూ ఉన్నారు. గడిచిన నెలన్నర కూటమి ప్రభుత్వం మీద రివ్యూ చూస్తే పవన్ తన పరిధిలో బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలు ఇటివంటి దూకుడు ప్రదర్శించినా పవన్ హెచ్చరిస్తూ వస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు వద్దు అని మాటిమాటికీ చెప్తూ వస్తున్నారు. ఏది చేసినా చట్ట ప్రకారమే ఉండాలని ఆయన అంటున్నారు.
అయితే, టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి భిన్నంగా కనబడుతోంది. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు వద్దు అని బయటకి చెబుతున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంటోంది. అయితే గత పదేళ్ళుగా సాగుతున్న వ్యవహారమే ఇదనుకోండి. గత ప్రభుత్వం కూడా బయటకు చెప్పేది ఒకటైతే, లోలోపల చేసింది మరొకటిగా ఉండేది.. కట్ చేస్తే ప్రజలే తగిన తీర్పు ఇచ్చారు.. అది వేరే విషయం. అయితే రాష్ట్రంలో తాజా పరిణామాలు చూస్తే మాత్రం టీడీపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో బొక్క పెట్టేవిగా కనబడుతున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ విషయమే తీసుకుంటే, కారణం ఏడైనా జరిగింది మాత్రం పాశవిక హత్య అని చెప్పుకోక తప్పదు. వారు ఏ పార్టీకి సంబందించినవారు అయినప్పటికీ జరిగింది మాత్రం దారుణం.
ఇదే విషయం వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న మాదిరి తయారయింది. ఈ విషయంలో మాత్రం జనసేన అధినేత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. హత్య చేసిన వారు వ్యక్తిగతంగా చేశారా మరోటా అన్నది పక్కన పెడితే, కూటమి ప్రభుత్వంలో ఇంత బరితెగించి నడి రోడ్డుపైన దారుణమైన హత్య జరగడం అనేది ప్రభుత్వానికే పెద్ద మచ్చ అని చెప్పుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ పలుమార్లు లా అండ్ ఆర్డర్ సరిచేస్తాం అని చెప్పుకొచ్చారు... మరి ఇపుడు ఈ ఘటనలు ఆయనకి కనబడడంలేదా? అని ఓ వర్గం వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇంత దుర్మార్గంగా హత్యలు చేసుకుంటారా? అన్నది జనంలోకి బాగా పోయింది. ఇది మంచి విధానం కానే కాదని చెప్పాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టేందుకు తరతమ భేదాలు చూడాకుండా వ్యవహరించాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: