గన్నవరంలో కనిపించని వైసీపీ జెండా.. వల్లభనేని ఏపీ వదిలి వెళ్లిపోయారా?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వైసీపీ నేతలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా కొడాలి నాని, రోజా, అంబటి, పేర్ని నాని వంటి వారు పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. వీరందరి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం వల్లభనేని వంశీ గురించి ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో కొత్త కొత్త ప్రచారాలు ఆయనపై వస్తున్నాయి. ప్రస్తుతం గన్నవరంలో కానీ, విజయవాడలో కానీ ఆయన కనిపించడం లేదని సన్నిహితులే పేర్కొంటున్నారు. దీంతో ఆయన ఏపీ విడిచి వెళ్లిపోయారని ప్రచారం సాగుతోంది. దీనిని ఖండించడానికైనా ఆయన మీడియా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎన్నికల ముందు వరకు చంద్రబాబు, లోకేష్‌లపై వైసీపీ విమర్శలతో విరుచుకుపడేది. అందులోనూ ఆ పార్టీ నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలు చేయడంలో ముందుండే వారు. ఒక వల్లభనేని వంశీ ఒకడుగు ముందుకు వేసి ఏకంగా నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌పై విమర్శలు చేస్తూ, ఆయనకు దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలు ఎందుకు వచ్చాయో చంద్రబాబు అడగాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఏపీలో ఒక్కసారిగా నిరసనలు భగ్గుమన్నాయి.

 నారా, నందమూరి అభిమానులు వల్లభనేనిపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కంటతడి సైతం పెట్టుకున్నారు. వైసీపీపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడానికి ఇది కూడా కారణమని వాదన లేకపోలేదు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన వంశీ ఆ తర్వాత గన్నవరంలో పట్టు బిగించారు. ఏకంగా టీడీపీ ఆఫీసులను ధ్వంసం చేయించడం, రాళ్ల దాడి చేయించడం వంటివి అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతానని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. వైసీపీ నుంచి గెలిచి ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావును టీడీపీలోకి తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం కూటమి గాలి వీయడంతో గన్నవరంలో వంశీ పరాజయం పాలయ్యారు. అనంతరం ఆయన బయటకు రావడం మానేశారు. ఆయన అమెరికా వెళ్లిపోయారనే ప్రచారం కూడా స్థానికంగా నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత గన్నవరంలో వైసీపీ కార్యాలయం కూడా మూతబడింది. వంశీ జాడ కూడా లేకపోవడంతో వైసీపీ ఈ నియోజకవర్గంలో కనుమరుగు అయిందనే వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: