సీమ ఎమ్మెల్యే తాలూకా : జేసీల వార‌స‌త్వానికి అస్మిత్ మ‌చ్చుతున‌క‌..!

RAMAKRISHNA S.S.
- చిన్న వ‌య‌స్సులోనే పొలిటిక‌ల్ ఎంట్రీ.. 2019లో ఓడి 2024లో సూప‌ర్ విక్ట‌రీ
- వైసీపీ నుంచి ఆహ్వానాలున్నా క‌న్నెత్తి చూడ‌ని జేసీ వార‌సుడు
( అనంత‌పురం - ఇండియా హెరాల్డ్ )
జేసీ బ్ర‌దర్స్‌. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ఈ బ్రాండ్‌కువాల్యూ ఎక్కువ‌. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో 40 ఏళ్ల‌పాటు వ‌రుస విజ‌యాలు .. గెలుపుత‌ప్ప‌.. ఓట‌మి ఎరుగ‌ని కుటుంబంగా పేరు తెచ్చుకున్న‌ది జేసీ ఫ్యామిలీ. ఇలాంటి కుటుంబం నుంచి ఇద్ద‌రు వార‌సులు వ‌చ్చారు. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి కుమారుడిగా జేసీ అస్మిత్ రెడ్డి రాజ‌కీయ అరంగేట్రం చేయ‌డం తెలిసిందే. 2019లోనే త‌న తండ్రి ప్ర‌భాక‌ర్ సీటును ఆయ‌న అందిపుచ్చుకున్నారు. కానీ, వైసీపీ హవాతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు.

కానీ, ప‌ట్టుద‌ల‌-కృషి క‌ల‌గ‌లిపి.. ముందుకు సాగి.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం.. వారి స‌మ‌స్య‌ల‌పై నిరంత‌రం పోరాటం చేయ‌డం వంటివి అస్మిత్ రెడ్డికి క‌లిసివ‌చ్చాయి.అంతేకాదు.. వైసీపీ చేసిన దాడులు.. పెట్టిన కేసుల‌పైనా నిరంత‌రం పోరాటం సాగించారు. కొన్ని సంద‌ర్భాల్లో కేసులు ముసురుకుని.. అస‌లు ఈ కుటుంబం రాజ‌కీయాల్లో ఉంటుందా?  విర‌మిస్తుందా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఇలాంటి సంద‌ర్భంలోనూ యువ నాయ‌కుడిగా అస్మిత్ ముందుకు వ‌చ్చారే త‌ప్ప‌.. వెన‌క్కి పోలేదు.

ఎక్క‌డా ఎవ‌రితోనూ.. రాజీ ప‌డ‌లేదు. 2021-22 మ‌ధ్య మా పార్టీలోకి రండి.. కేసులు ఎత్తేస్తాం.. అని వైసీపీ నుంచి ఆహ్వానం అందినా.. తాడ‌ప‌త్రి కౌన్సిల్ చైర్మ‌న్ ప‌ద‌విని ప‌రోక్షంగా అప్ప‌గిస్తూ.. లాలించినా.. వైసీపీ వైపు జేసీ కుటుంబం చూడ‌లేదు. ఈ పంథానే.. అస్మిత్ రెడ్డి కూడా కొన‌సాగించారు. ప‌లితంగా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యారు. యువ‌త‌ను స‌మీక‌రించ‌డం.. నారా లోకేష్ చేసిన పాద‌యాత్ర‌(యువ‌గ ళం)ను విజ‌య వంతం చేయ‌డం ద్వారా పార్టీలోనూ అస్మిత్ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ క్ర‌మంలోనే యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌న్న చంద్ర‌బాబు.. జేసీ కుటుంబంలో అస్మిత్‌ను పిలిచి మ‌రీ ఈ సారి టికెట్ ఇచ్చారు. వాస్త‌వానికి జేసీ బ్ర‌ద‌ర్స్ ప‌రంగా.. గ‌త ఐదేళ్లలో వారు పార్టీకి చేసిన సేవ‌లు.. పార్టీ అధినేత ఇచ్చిన టాస్కులుపూర్తి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. దీంతో టికెట్ ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని కూడా అనుకున్నారు. కానీ అస్మిత్ రెడ్డి.. ప‌టిమ‌ను చంద్ర‌బాబు అర్థం చేసుకుని ముందుకు సాగారు. ఫ‌లితంగా ఆయ‌న కు టికెట్ ఇవ్వ‌డంతోపాటు.. గెలిపించుకున్నారు. ఇదీ.. సంగ‌తి!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: