తెలంగాణ: పార్టీ ఫండ్ నొక్కేసిన బీజేపీ నేతలు?

Veldandi Saikiran
అదిలాబాద్ బీజేపీ పారీలో కలవరం మొదలైందట. ఎంపీ ఎన్నికల కోసం పార్టీ ఇచ్చిన ఫండ్స్ ను నొక్కేసారంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో నేతల్లో కంగారు పుడుతుందట. పోలింగ్ ఏజెంట్ కోసం ఇచ్చిన డబ్బు లెక్కల్లో తేడాలు రావడంతో అసలు విషయం బయటపడిందట. దీంతో నేతలపై అధికారులకు ఫిర్యాదులు వెళుతున్నాయట. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఫండ్ నిధులు పక్కదారి పట్టించడంపై ఆదిలాబాద్ కమలం పార్టీలో కలవరం రేపుతోంది. ఎన్నికల తర్వాత నేతల మధ్య వర్గ విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. పైపైకి అంతా బాగానే కనిపిస్తున్న అంతర్గతంగా మాత్రం ఒకరిపై ఒకరు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.

 
తాజాగా పార్లమెంట్ పరిధిలోని ఒకరిద్దరు నేతలు లోక్ సభ ఎన్నికల నిధుల వ్యయంపై పెద్దలకు ఫిర్యాదులు చేయడం అదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారిందట. గడిచిన అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన నేతలు పార్టీలో ఆధిపత్యం కోసం ఎవరికి వారు ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఫండ్ లెక్కలు తారుమారు అవడం ఓ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఖర్చు చేసిన నిధులపై అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. పెద్దగా ఖర్చు చేయకపోయినా మోడీ ఇమేజ్ తోనే గెలుస్తామని భావించిన కమలం పార్టీ నేతలు పార్టీ ఫండ్ ఖర్చు చేయకుండా పక్కదారి పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.


పార్లమెంట్ పరిధిలనీ ఏడు నియోజకవర్గాల్లోనూ పెద్దగా ఖర్చు చేసిన దాఖలాలు లేవంటున్నారు కొంతమంది నేతలు. లోక్ సభ ఎన్నికల తర్వాత నేతల మధ్య పార్టీ ఫండ్ నిధుల ఖర్చు చిచ్చు రేపుతుందన్న వాధనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ చేరిన కమలం పార్టీ నేతల పంచాయతీ జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ పార్లమెంటరీ టికెట్ ఆశించి భంగపడ్డ ఒకరిద్దరు నేతలు కూడా పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోగా ఇచ్చిన డబ్బులు కూడా ప్రచారానికి ఖర్చు చేయకుండా వాడుకున్నారనే ఆరోపణలు సొంతపార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోందట. అదిలాబాద్ సిట్టింగ్ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో నలుగురు బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.

 
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నుంచి వచ్చిన ఫండ్ కి ఎన్నికల్లో ఖర్చు చేసిన నిధులకు ఎలాంటి పొంతన లేకుండానే పోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు అధిష్టానం ఇచ్చింది ఎంత? ఎన్నికల్లో వారు పంచి పెట్టిన డబ్బులు ఎంత? అనే ప్రశ్నలు సర్వత్ర వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించిన నేతలపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేయడం పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వర్గం నేతలు మరో వర్గం నేతలపై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేయటం....ఆపై పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడం కమలం పార్టీలో పరిపాటిగా మారిందంటున్నారు. పార్టీలో తమకున్న పరిచయాలు పలుకుబడితో ఓ నేత చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నాడంటూ జోరుగా చర్చ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: