చంద్రబాబు: టీడీపీ నేతలకు గుడ్ న్యూస్..ఇక పదవుల జాతరే?

Veldandi Saikiran
తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్ చేశారు సీఎం చంద్రబాబు. టీడీపీ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని తాజాగా ప్రకటన చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని భావిస్తోన్న చంద్రబాబు...ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జరిపిన టెలీ కాన్ఫరెన్సులో చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తూ... ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తానని... ఎవరు ఏ మేరకు పని చేశారోననే సమాచారం పార్టీ దగ్గర ఉందని వెల్లడించారు చంద్రబాబు. కష్టపడిన వారికి ప్రొత్సాహం ఉంటుందని... అధికారంలోకి వచ్చామని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దని కోరారు.గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమని.. గతంలో ఏర్పాటు చేసిన చోటే అన్న క్యాంటీన్లు మళ్లీ పెట్టాలని ఆదేశించారు చంద్రబాబు.

వంద రోజుల్లో అన్న క్యాంటీన్ల పునరుద్దరణ ఉంటుందని ప్రకటించారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని స్పష్టం చేశారు చంద్రబాబు. కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్ తో... 57 శాతం ఓట్ షేర్ ను సాధించిందని వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజారిటీని మనం కాపాడుకోవాలని.. కార్యకర్తలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు చంద్రబాబు.

నాకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉంటానికి వీల్లేదని... ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. వినతుల స్వీకరణకు పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుంటామని.. సచివాలయంలోనే వినతులు స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నానని చెప్పారు బాబు. ప్రజా వినతులు స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని...ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దుష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: