కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు దక్కని ప్రాతినిథ్యం.. పవన్ అడగలేదా?

Suma Kallamadi
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. అయితే బీజేపీ ఆశించినట్లు ఆ పార్టీకి అధికారానికి అవసరమైన సీట్లు సొంతంగా దక్కలేదు. కేవలం 240 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితం అయింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం తలెత్తింది. ఎన్డీయేలో తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ, జనసేన, బీహార్ నుంచి జేడీయూ కీలకంగా వ్యవహరించాయి. టీడీపీకి 16, జనసేనకు 2, జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు. వీరి మద్దతు లేకుంటే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇక ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా కేంద్రంలో వారి అవసరాలను పవన్ కళ్యాణ్ గుర్తించారు. 

దీంతో పలుమార్లు ఢిల్లీ పర్యటనలు చేపట్టి టీడీపీ, బీజేపీలను దగ్గర చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఆయన ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడానికి కీలక పాత్ర పోషించారు. ఆయన ఊహించినట్లే ఏపీలో కూటమి 164 సీట్లతో అఖండ మెజారిటీని సాధించింది. ఎంపీ స్థానాల్లో టీడీపీకి 16, బీజేపీకి 3, జనసేనకు 2 దక్కాయి. ఇలా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన ఎంతో దోహదపడ్డారు. అలాంటిది జనసేనకు కనీసం కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రి పదవి కూడా దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ వాళ్లు ఇవ్వలేదా లేక పవన్ వారిని అడగలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కూడా తెలియాలి అనేది పవన్ సినిమాలోని ఓ డైలాగ్. దీనికి తగ్గట్టే ఎన్నికల సమయంలో ఆయన అసెంబ్లీ, ఎంపీ సీట్లను తగ్గించుకున్నారు. బీజేపీకి ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కూటమికి పవన్ వెన్నెముకగా వ్యవహరించారు. దీనిని ప్రధాని మోడీ సైతం గుర్తించారు. ఎన్డీయే పార్టీల మీటింగ్‌లో పవన్‌ను పొగడ్తలతో ముంచేశారు. అయితే కేబినెట్‌లో మాత్రం జనసేనకు ప్రాతినిథ్యం దక్కలేదు.

ఎన్డీయేలో భాగమైన మిత్ర పక్షాలలో ఒకటి, రెండు ఎంపీ పదవులు ఉన్న పార్టీలకు సైతం మంత్రి పదవి దక్కింది. అయితే జనసేనను మాత్రం బీజేపీ పెద్దలు పక్కన పెట్టేశారు. దీనిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు మాత్రమే పవన్ చూస్తున్నారని, అందుకే కేంద్ర కేబినెట్‌లో స్థానంపై ఆయన గట్టిగా పట్టుబట్టలేదని చెబుతున్నారు. ఏదేమైనా జనసేనకు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ దక్కి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు ఏపీలో వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: