వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా జగన్ మౌనం.. దీనికి కారణమేంటి?

Suma Kallamadi
ఏపీలో రాజకీయాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. 151 ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తీరా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుంది. ఏకంగా 140 స్థానాలను కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఇక ఈ ఫలితాలను రాజకీయ విశ్లేషకుల అంచనాలకు సైతం చిక్కలేదు. వైసీపీ ఇంత ఘోరంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదని ఎవరూ ఊహించలేదు. ఏపీ ప్రజలు కూటమికి పట్టం కట్టి ఏకపక్ష తీర్పు ఇచ్చేశారు. 

ఆ తర్వాత ఏపీలో అసలు రాజకీయం మొదలైంది. ఇప్పటి వరకు టీడీపీని, జనసేనను తమ మాటల తూటాలతో విమర్శించిన వైసీపీ అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వంటి నేతలు సైతం ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆ పార్టీ నేతలు తమ ప్రత్యర్థి పార్టీల నేతలను వ్యక్తిగతంగా సైతం దూషించే వారు. ఎన్నికల ఫలితాలు రాగానే అలాంటి వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు పూనుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా జగన్ నోరు విప్పలేదు. దాడులు అరికట్టాలని కొందరు నేతలను గవర్నర్ దగ్గరికి పంపించారు. అనంతరం ఒక ట్వీట్ మాత్రమే చేసి వదిలేశారు. మరో వైపు వైసీపీ నేతలను చొక్కాలు విప్పి టీడీపీ నేతలు కొడుతున్నారు. మోకాళ్లపై ఉంచి లోకేష్, చంద్రబాబు ఫొటోలకు క్షమాపణలు చెప్పిస్తున్నారు. అయినప్పటికీ జగన్ చలించలేదనే విమర్శలు వస్తున్నాయి. 2014లో సైతం వైసీపీ ఓటమి పాలై ప్రతిపక్షంగా మిగిలింది. అప్పుడు ఎన్నికల ఫలితాలు రాగానే జగన్ బయటకు వచ్చారు. ప్రతిపక్ష నేతగా తానేంటో చూపించారు. ప్రస్తుతం మాత్రం జగన్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

 కేవలం 11 సీట్లలోనే వైసీపీ గెలుపొందడంపై ఆయనలో నైరాశ్యం ఏర్పడిందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. అయితే ఆయనకు అండగా నిలబడ్డ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే, పార్టీ అధినేతగా జగన్ సైలెంట్‌గా ఉండడం సరికాదనే వాదన వినిపిస్తోంది. టీడీపీని విమర్శించకుండా ఆయనను ఎవరు ఆపుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ మద్దతు అవసరం చాలా ఉంది. ఈ తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదాను టీడీపీ డిమాండ్ చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపించాలని వైసీపీ అధినేతగా డిమాండ్ చేయొచ్చు. వీటన్నింటిపై ప్రస్తుతం జగన్ సైలెంట్‌గా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: