ఏపీ బీజేపీలో మంత్రులు వీళ్లేనా...!

RAMAKRISHNA S.S.
బీజేపీ త‌ర‌ఫున ఈ సారి అసెంబ్లీలో ఎనిమిది మంది విజ‌యం ద‌క్కించుకున్నారు. నిజానికి ఆ పార్టీ పోటి చేసింది.. ప‌ది స్థానాల్లోనే అయినా.. గెలిచింది మాత్రం 8 స్థానాలు. అంటే.. ఇది ఆ పార్టీ ఏపీ చ‌రిత్ర‌లోనే కీల‌కంగా మారింది. దీంతో మంత్రి ప‌ద‌వుల్లోనూ.. ఆ పార్టీకి ప్రాధాన్యం ఉంటుంది. ఎంత లేద‌న్నా.. రెండు నుంచి మూడు మంత్రి ప‌ద‌వులు ఈ పార్టీకి ద‌క్కాల్సి ఉంది. అయితే.. చంద్ర‌బాబు ఎంత వ‌ర‌కు వారికి ఇస్తార‌నేది ఒక‌ చ‌ర్చ.

ఒక వేళ రెండు నుంచి మూడు ప‌ద‌వులు ఖాయ‌మ‌ని.. ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ మేర‌కు అనుకున్నా.. ఈ ముగ్గురి విష‌యంలో ఎవరికి ద‌క్కుతాయ‌నేది కూడా.. ఆస‌క్తిగా మారింది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు.. మంత్రి ప‌ద‌వుల రేసులో ముందున్నారు. విజ‌య‌వాడ వెస్ట్ నుంచి గెలిచిన సుజ‌నా చౌదరికి మంత్రి పీఠం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అయితే .. ఇదే ఉమ్మ‌డి జిల్లా కైక‌లూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస‌రావుకు.. బీజేపీ పెద్ద‌ల అండ ఉంది.

పైగా గ‌తంలోనూ ఆయ‌న కూట‌మి స‌ర్కారులో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ఉంది. ఇక‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డికూడా.. బీజేపీ త‌ర‌ఫున మంత్రి ప‌ద‌వుల విష‌యం లో గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఈయ‌న కూడా.. గ‌తంలో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో సీమ నుంచి ఈయ‌న‌కు కూడా ప్రాధాన్యంపెరుగుతోంది. అదే విధంగా విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న విష్ణు కుమార్ రాజు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

వీరితోపాటు.. మ‌రికొంద‌రు కూడా.. పోటీలో ఉన్నారు. దీంతో అన్ని మంత్రి ప‌ద‌వుల విష‌యంలోనూ బీజేపీ నేత‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. ప‌ద‌వులు ఆశిస్తున్న‌వారిలో చాలా మందికి హై క‌మాండ్‌తో సంబంధాలు ఉండ‌డం.. అక్క‌డ ప‌లుకుబ‌డి కూడా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ హై క‌మాండ్ నుంచి సిఫార‌సు చేయించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఎవ‌రికి ఈ ప‌ద‌వులు వ‌రిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: