రామోజీరావు: ఎన్నో పార్టీలు.. ఎందరో ముఖ్యమంత్రులను శాసించిన దిగ్గజం..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన 'పాంచజన్యం ' పూరించి ఎన్నికల కురుక్షేత్రంలో అక్షరాలనే ఓ ఆయుధంగా చేసిన ఘనుడు రామోజీది. సొంత డబ్బు వెచ్చించి తెలుగు భాషను మరింత వ్యాప్తి చేయడం కోసం , ఆధునీకరణ కోసం ఆయన చేసిన కృషి ' తెలుగు జాతి ' ఎన్నటికీ మరువదు అనే చెప్పాలి. ఓ సాధారణ రైతు కుటుంబం నుండి అత్యున్నత స్థాయికి , విలువలతో కూడిన నిబద్ధతతో ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం.
ఇక ఎన్నోసార్లు నియంతృత్వ ప్రభుత్వాలకు , ప్రభుత్వాధినేతలకు తలవంచకుండా ఎదురునిలబడి పోరాడిన రామోజీ అంటే మహామహా ప్రభుత్వాధినేతలకు... రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం హడల్ అని చెప్పాలి. ఈనాడు ఆవిర్భవించాక అందులో వచ్చే వార్తలు అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు హడల్. ఇక 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నిజం చెప్పాలంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయనే పెద్ద పోరాటం చేసి.. ఆయనే ఓ ప్రతిపక్షమై ఎన్టీఆర్ గెలుపులో కీలకం అయ్యారు.
ఆ తర్వాత ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పుడు రామోజీ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. 1985లో ఎన్టీఆర్ గెలుపులోనూ కీలకం అయ్యారు. ఈనాడు రాతల వల్లే 1985లో ఓ ప్రజాఉద్యమం, ప్రజా విప్లవం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిందని చెప్పాలి. ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా రామోజీ మీడియా రంగంలో తనదైన ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. అంతలా ఈనాడు తో ఆయన తెలుగు ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయారు. అందుకే తెలుగు మీడియా చరిత్రలో ఆయన ఎప్పటకి ఓ దిక్సూచిలా నిలిచి పోతారనడంలో సందేహం లేదు.