ఏపీ ఎన్నికలపై యోగేంద్ర యాదవ్ జోస్యం నిజమవుతుందా?

Purushottham Vinay
•కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న యోగేంద్ర యాదవ్
•ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లపై యోగేంద్ర యాదవ్ ఆసక్తికర జోస్యం

ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. పోలింగ్ ముగిసి 2 వారాలు గడిచిపోయినప్పటికీ.. పోలింగ్ సరళి అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టడం లేదు. భారీగా నమోదైన పోలింగ్ శాతం తమకంటే తమకు అనుకూలంగా ఉన్నాయని అధికార, విపక్షాలు చెప్పుకుంటున్నాయి. పాజిటివ్ ఓట్లని వైసీపీ చెప్తుంటే.. ప్రజావ్యతిరేకతకు నిదర్శమని టీడీపీ కూటమి నేతలు గట్టిగా చెప్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల వ్యూహకర్తలు, పలు సర్వేలు కూడా ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానిపై తమ అంచనాలను  పంచుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం ఖాయమని.. ఇప్పటికే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు.2019 ఎన్నికల్లో 151 ఓట్లు సాధించిన వైసీపీ ఈసారి 50 సీట్లకు పరిమితమవుతుందంటూ పీకే ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో కామెంట్స్ చేశారు. ఇక తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్ ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారనే దానిపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్.. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై తన అంచనాను తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో 15 సీట్లను టీడీపీ, బీజేపీ ఇంకా జనసేన కూటమి గెలుచుకుంటుందని యోగేంద్ర యాదవ్ అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 3 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని, టీడీపీ, జనసేనకు కలిపి 12 ఎంపీ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందన్నారు.

ఇక కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం మూడోసారి ఏర్పాటవుతుందన్న యోగేంద్ర యాదవ్.. అయితే మిత్రపక్షాల సహకారం బీజేపీకి కావాల్సి వస్తుందని  చెప్పారు. బీజేపీకి సింగిల్ గా 260కి మించి సీట్లు రావన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఎన్డీయే మిత్రపక్షాల అవసరం వస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోరు సాగుతుందని.. బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కే ఛాన్స్ ఉందని యోగేంద్ర యాదవ్ చెప్పారు.మరోవైపు 25 ఎంపీ సీట్లకు గానూ టీడీపీ 17 చోట్లా, బీజేపీ 6, జనసేన 2 చోట్లా పోటీ చేయడం జరిగింది. వైసీపీ సింగిల్‌గా 25 స్థానాలలో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక లోక్ సభ ఎంపీ సీట్ల విషయంలో తన అంచనాలను వెల్లడించిన యోగేంద్ర యాదవ్ ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో 25 ఎంపీ సీట్లలో కూటమికి మొత్తం 15 సీట్లు వస్తాయంటే.. వైసీపీకి 9 నుంచి 10 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని ఆయన అభిప్రాయం.మరి ఈ రకంగా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో  పోరు రసవత్తరంగా సాగే ఛాన్సు ఉంది. కానీ చాలా సర్వేల ప్రకారం వైసీపీకి ఎక్కువ స్థానాలు దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి యోగేంద్ర యాదవ్ లెక్కలు నిజమవుతాయో లేదో అనేది.అయితే ఎవరి అంచనాలు ఏ మేరకు నిజమవుతాయనేది జూన్ 4వ తేదీన  తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: