సిట్ రిపోర్ట్ లో వెలుగులోకి సంచలన విషయాలు.. రిపోర్ట్ లో తేలిన విషయాలివే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు కొన్ని ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఈ అల్లర్ల విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసి ఎన్నికల కమిషన్ కు నివేదికను అందజేసింది. ప్రధానంగా ఏపీలోని పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనల విషయంలో అధికారులు దర్యాప్తు చేశారు.
 
డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మొదట సిట్ నివేదికను అందజేయగా ఆ తర్వాత సీఈవో ఎంకే మీనాకు, కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ రిపోర్ట్ ను అందజేయడం గమనార్హం. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని ఐదు అంశాల గురించి సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేశారని తెలుస్తోంది. డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తులో లోపాలను గుర్తించామని నిందితుల అరెస్ట్ కోసం స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు.
 
రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడ్డారని ఈ కేసులకు సంబంధించి అదనపు సెక్షన్లను జోడించడం కొరకు కోర్టులో మెమో దాఖలు చేయాల్సి ఉందని ఈ అల్లర్లు తీవ్రమైన నేరాలు అని మరణాలకు దారి తీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని డీజీపీ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్‌లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని ఆయన సూచనలు చేశారు.
 
అల్లర్లకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంతో పాటు వాళ్లపై చార్జీ షీట్లు దాఖలు చేయాలని డీజీపీ చెప్పుకొచ్చారు. సిట్ పర్యటనలో ఎంతోమంది బాధితులు విజ్ఞాపనలు ఇచ్చారని సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్లడించారు. 33 కేసుల్లో 1370 మందిని నిందితులుగా గుర్తించామని 124 మందిని అరెస్టు చేశారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్త అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: