పవన్‌ను పిఠాపురంలో క్రాస్ ఓటింగే ఓడిస్తోందా ?
- జనసేనాని ఇలాకాలోనే ఎంపీ ఓటు క్రాస్
- పిఠాపురం వదులుకుని కష్టాల్లో పడ్డ టీ టైం ఉదయ్ శ్రీనివాస్
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే జరిగిన క్రాస్ ఓటింగ్ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొంప ముంచేయనుందా..? పిఠాపురంలో పవన్ అభిమానులు, కాపు సామాజిక వర్గం ఓటర్లు, ఇతర న్యూట్రల్ ఓటర్లు అసెంబ్లీ వరకు పవన్ కు ఓటేసి పార్లమెంటుకు వచ్చేసరికి వైసీపీ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారా..? అంటే ఇప్పుడు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఇదే చర్చ నడుస్తోంది. వాస్తవానికి చలమలశెట్టి సునీల్ రాజకీయ ప్రస్థానం 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రారంభమైంది. ఆ ఎన్నికలలో కాకినాడ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గట్టి పోటీలో సునీల్ ఓడిపోయారు. 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి మరోసారి కాకినాడ పార్లమెంటుకు పోటీ చేసి మళ్లీ స్వల్ప తేడాతో ఓడిపోయారు.
చివరకు 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి మూడోసారి మూడో పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ స్వల్ప తేడాతో వంగా గీత చేతిలో ఓడిపోయారు. ఈసారి సునీల్ వైసీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వ్యక్తిగతంగా మంచివాడు అన్న పేరుతో పాటు గత మూడు ఎన్నికలలోను స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి.. ఈసారి సునీల్ పై చాలా ఎక్కువగా కనిపించింది. అందుకే కాకినాడ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీకి.. కూటమికి అనుకూలంగా ఓట్లు వేసిన వారిలో చాలామంది పార్లమెంటుకు వచ్చేసరికి.. సునీల్ కు అనుకూలంగా ఫ్యాన్ కు క్రాస్ ఓటింగ్ చేశారన్న చర్చ గట్టిగా నడుస్తోంది.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ వాళ్లు.. పవన్ కళ్యాణ్ వీరాభిమానుల సైతం అసెంబ్లీకి పవన్‌కు ఓటు వేసి... ఎంపీకు వచ్చేసరికి వైసీపీ నుంచి పోటీ చేసిన సునీల్ కు ఓట్లు వేసినట్టు పోలింగ్ సరళి చెబుతోంది. కాకినాడ నుంచి జనసేన తరఫున పార్లమెంటుకు పోటీ చేసిన టీ టైం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వాస్తవంగా పిఠాపురం అసెంబ్లీ సీటు ఆశించి అక్కడ పనిచేశారు. అయితే అక్కడ పార్టీ అధినేత స్వయంగా రంగంలోకి దిగడంతో ఉదయ్‌కు కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. తన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సీటులో పార్టీ అధినేత పవన్ స్వయంగా పోటీ చేయటం అంటే ఉదయ్‌కు చాలా ప్లస్ అవ్వాలి.
అయితే ఇటువైపు చలమల శెట్టి సునీల్ వరుసగా ఓడిపోయారు అన్న సానుభూతి అన్ని వర్గాల్లోనూ బాగా వ్యక్తం అయింది. మరి ఈ క్రాస్ ఓటింగ్ ఉదయ్ శ్రీనివాస్‌కు ఎంత వరకు దెబ్బ వేసింది..? పవన్ తాను పోటీ చేసిన నియోజకవర్గంలో భారీ మెజార్టీ రప్పించి జనసేన అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తారా..? లేదా..? అన్నది చూడాలి.