విజ‌య‌వాడ: త‌మ్ముడు చిన్ని మీద అన్న నాని గెలిచే ఛాన్స్ ..?

RAMAKRISHNA S.S.
- పార్ల‌మెంటు ప‌రిధిలో 5 సీట్లు టీడీపీకే ఎడ్జ్‌.. అయినా ఎంపీకి క్రాస్ ఓటింగ్ ..?
- విజ‌య‌వాడ న‌గ‌రంలో భారీ క్రాస్ ఓటింగ్‌పై నాని ఆశ‌లు
- తెలుగు గ‌డ్డ‌మీదే ఆస‌క్తిగా మారిన కేశినేని బ్ర‌ద‌ర్స్ పార్ల‌మెంట్ ఫైట్
- వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో కూట‌మికి కొర‌క‌రాని కొయ్య‌గా నాని
( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్‌లోనే  కాదు యావత్ తెలుగు ప్రజలలో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎన్నిక విజయవాడ పార్లమెంటు సీటు. ఇక్కడ నుంచి టీడీపీ, వైసీపీ తరఫున సొంత అన్నదమ్ములు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి పార్టీ మారిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నుంచి ఆయన సోదరుడు కేశినేని చిన్ని పోటీలో ఉన్నారు. మామూలుగా చూస్తే విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ వెస్ట్ లో బిజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీలో ఉన్నారు. మిగిలిన ఆరు స్థానాలలోనూ టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు.

నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాలు మినహాయిస్తే రూరల్ ప్రాంతంలో ఉన్న జగ్గయ్యపేట, నందిగామ, పోలవరంలో టీడీపీ గెలుపు దాదాపు ఖరారు అయినట్టే. టీడీపీ నుంచి అమరావతి జేఏసీ లో కీలకంగా వ్యవహరించిన గుంటూరు జిల్లాకు చెందిన కొలికిపూడి శ్రీనివాసరావు పోటీ చేస్తున్న తిరువూరులో మాత్రం ఆయన గెలుపు అంత సులువు కాదు అంటున్నారు. ఇక పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో మైలవరంలో టీడీపీకి భారీ ఆధిక్యత వస్తుందని అంచనా వేస్తున్నారు.

నందిగామలో గట్టి పోటీ ఉన్న టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బయటపడుతుందని అంటున్నారు. జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గెలుపు ఖాయం అయినట్టే అని చెబుతున్నారు. ఇక నగరంలో విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్నా కూడా తూర్పులో గద్దె రామ్మోహన్ కు గెలుపు ఉండవచ్చు అన్నదే ఎక్కువమంది చెబుతున్న మాట. అవినాష్ ముందు జోరు చూపించిన తర్వాత రేసులో వెనకబడినట్టు చెబుతున్నారు. సెంట్రల్లో బోండా ఉమాకు తిరిగే ఉండేది కాదు.

అయితే ఇక్కడ నుంచి కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేస్తున్న బాబురావు కు మంచి పట్టు ఉంది. దీంతో ఆయన చీల్చే ఓట్లు బొండా ఉమా మెజార్టీని ఎంతవరకు తగ్గిస్తాయి అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక వెస్ట్ నియోజకవర్గంలో వార్‌ వన్ సైడ్ గా ఉండేది. సుజనా చౌదరి వచ్చాక భారీగా ధన ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని సామాజిక వర్గాలను బిజేపికి అనుకూలంగా ఏకం చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ కూడా గట్టి పోటీ నెలకొంది. వాస్తవంగా చూస్తే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తిరువూరు, విజయవాడ వెస్ట్ మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా.. ఈ రెండు చోట్ల కూడా గట్టి పోటీ ఉంది. అయితే లోక్‌స‌భకు వచ్చేసరికి విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాలలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కేశినేని నానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న చర్చ కూడా గట్టిగా నడుస్తోంది.

నానిపై వ్యక్తిగతంగా వివాదాలు లేవు. మంచి మనిషి అన్న పేరు ఉంది. పైగా టిడిపి నుంచి బలవంతంగా బయటకు పంపేశారు అన్న సానుభూతి కూడా ఆయనపై ఉంది. నానితో పోలిస్తే చిన్నికి అంత చరిష్మా లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత రాజధాని మార్పు ప్రభావంతో పాటు.. కమ్మ సామాజిక వర్గ అండదండలు ఇవన్నీ ఎవరిపై ఎలా ప్రభావం చూపిస్తాయి. కేశినేని నానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ ఎంతవరకు జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: