పెట్రోల్ రూ.400లు, గ్యాస్ సిలిండర్ రూ.5000లకు పెరుగుతాయంట.. కేటీఆర్ సంచలన ప్రకటన

Suma Kallamadi
తెలంగాణలో మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఎన్నికల ప్రచార సభల్లో బీఆర్ఎస్ పార్టీయే అధికారం చేపడుతుందని బలంగా ప్రసంగాల్లో విశ్వాసం వ్యక్తం చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వారికి నిరాశ కలిగించాయి. అవి ముగిసి ఎన్నో రోజులు కాలేదు. ఇంతలో లోక్‌సభ ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిల పడితే ఆ పార్టీలో నాయకులు మరింత మంది పక్క చూపులు చూస్తారనడంలో సందేహం లేదు. దీంతో తెలంగాణలో తమ పట్టు నిలుపుకునేందుకు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ రెండు పార్టీలను తమ ప్రత్యర్థులుగా భావిస్తూ ప్రతి రాజకీయ సమావేశంలోనూ కేటీఆర్ తూర్పారపడుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ ప్రజల వాణి వినిపించేందుకు బీఆర్ఎస్‌కు ఎక్కువ ఎంపీలను ఇవ్వాలని కోరుతున్నారు. బీజేపీకి మరోసారి కేంద్రంలో అధికారం ఇస్తే ఏం జరుగుతుందో ప్రజలకు వివరిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరుపున తాజాగా కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో బీజేపీపై ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీకి అధికారం ఇస్తే పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.500లకు పెంచుతారని పేర్కొన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.5,000లకు పెంచుతారని ఆరోపించారు. నిత్యావసర ధరలు ఆకాశానికి అంటినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. అబ్ కీ బార్ 400 అని ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలంతా చెబుతున్న నినాదానికి అసలైన అర్ధం ఇదేనన్నారు. ప్రధాని మోడీ మనకు ప్రియమైన ప్రధాని కాదని, పిరమైన ప్రధాని అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని ద్రోహం చేశాయని, రాష్ట్ర అభివృద్ధిని భ్రష్టు పట్టించాయని పేర్కొన్నారు. చావు నోట్లో తల పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన పోరాటాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని కోరారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టోల్ ఛార్జీలు పెంచారని చెప్పారు. ఓ వైపు వివిధ రకాల సెస్‌లతో ప్రజలను కేంద్రం దోచుకుంటోందన్నారు. పెట్రోల్‌పై భారీగా పన్ను వసూలు చేస్తున్నప్పుడు మరో వైపు టోల్ ఛార్జీలు ఎందుకని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ మంది ఉండాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: