రాజకీయాల్లో దూసుకుపోతున్న ఉత్తరాంధ్ర వీరవనితలు?

Purushottham Vinay

•ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సత్తా చాటుతున్న వీర వనితలు
•ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా రాణిస్తున్న ఉత్తరాంధ్ర మహిళలు
ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మహిళలు రాజకీయాల్లోకి వచ్చి చక్కగా రాణిస్తున్నారు. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.1972 వ సంవత్సరంలో మాడుగుల నియోజకవర్గం నుంచి బొడ్డు కళావతి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమెకు విజయనగరం జిల్లాలో పోటీ చేసేందుకు అవకాశం వచ్చినా ఓటమి పాలయ్యారు. ఇక మాడుగుల నియోజకవర్గం నుంచి 1983లో అల్లు భానుమతికి తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఇచ్చింది. అయితే ఆమె నామినేషను తిరస్కరణకు గురికావడంతో డమ్మీగా వేసిన రెడ్డి సత్యనారాయణ అప్పుడు అభ్యర్థి అయ్యారు. 1983లోనే విశాఖ-1 నుంచి గ్రంధి మాధవి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యి బాగా రాణించారు. ఆ తరువాత పరిణామాల్లో ఆమె నాదెండ్లకు మద్దతుగా నిలిచారు.


1985 వ సంవత్సరంలో అసెంబ్లీ రద్దయిపోయింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో అల్లు భానుమతికి అవకాశం లభించి ఆమె శాసన సభకు ఎన్నికయ్యారు. ఇక 1985లోనే విశాఖ-2 నియోజకవర్గం నుంచి రాజాన రమణి ప్రాతినిధ్యం వహించారు.1989లో విశాఖపట్నం నుంచి ఈటి విజయలక్ష్మికి శాసనసభ్యురాలిగా ఛాన్స్ లభించింది. ఆ తర్వాత 1994లో ఆమెను పరవాడ నియోజక వర్గానికి మార్చడంతో ఓటమి పాలవ్వడం జరిగింది. ప్రొఫెసర్‌గా ఉన్న పిన్నింటి వరలక్ష్మి 1989 ఎన్నికల్లో విశాఖ-2 నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసి, గెలుపొంది తరువాత శాసనసభలో అడుగు పెట్టారు. మహిళల ప్రాతినిధ్యం సిటీలో ఎక్కువగా ఉండగా రూరల్‌ జిల్లాలో మాత్రం అంతగా కనిపించలేదు. 


2009 వ సంవత్సరంలో బోళెం ముత్యాలపాప నర్పీపట్నంలో అయ్యన్నపాత్రుడిని ఓడించి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్లు కూడా ఎవరికీ అవకాశం లభించలేదు. ఇక 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి శాసనసభకు ఎన్నికయ్యారు.ఇంకా 2019 ఎన్నికల్లో పాడేరు నుంచి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు.ఇక ఈ నెలలో జరుగుతున్న ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానానికి బొత్స ఝాన్సీ (వైసీపీ), అరకులోయ స్థానానికి కొత్తపల్లి గీత (బీజేపీ), చెట్టి తనూజరాణి (వైసీపీ), పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత (టీడీపీ), పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి గిడ్డి ఈశ్వరి (టీడీపీ), మాడుగుల నుంచి ఈర్లె అనురాధ (వైసీపీ) పోటీలో దిగుతున్నారు. ఇక వీరిలో విజేతలుగా ఎవరు నిలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: