ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాలివే.. ఈసీ ఫోకస్ తో పరిస్థితులు మారతాయా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల జాబితా తాజాగా వెల్లడైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో మొత్తం 14 సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలో మే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనుండగా ఇప్పటివరకు 203 కోట్ల రూపాయల సొత్తు సీజ్ చేశామని ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
 
ఈ 14 నియోజకవర్గాల్లో నూటికి నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ అమలు చేస్తామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలోని 64 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, ఆళ్లగడ్డ, ఒంగోలు, మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
 
గతంలో ఈ ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గాల్లో ఎదురైన పరిస్థితులు, ఫిర్యాదులు, ఎన్నికల పరిశీలకుల సూచనల ఆధారంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించడం జరిగిందని భోగట్టా. ఈ నియోజకవర్గాలలో కేంద్ర బలగాలను మోహరించనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని భోగట్టా. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 
జనసేన పార్టీ పోటీ చేసే రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రం ఇతరులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించే ఛాన్స్ లేదని ముకేశ్ కుమార్ మీనా అన్నారు. అభ్యర్థుల తుది జాబితాను ఇప్పటికే ఖరారు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉంచుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ, కూటమి నేతలు తమ వంతు కష్టపడుతూ కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: