నెల్లూరు: కూటమిలో కాకరేపుతున్న అసమ్మతి కుంపట్లు?

Purushottham Vinay
ఎన్నికల వేళ కూటమిలో అసమ్మతి కుంపట్లు సెగలు రేపుతూనే ఉన్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా కూడా టిక్కెట్ల వేడి ఇంకా చల్లారడం లేదనే చెప్పాలి.టిక్కెట్లు దక్కకపోవడంతో పలువురు నేతలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంమవుతున్నారు.ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. తాజాగా.. నెల్లూరు జిల్లాలో టీడీపీలో రెబల్స్ బెడద క్యాండేట్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ఎవరికివారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే.. నామినేషన్ల గడువు ముగింపు దశకు చేరుకుంటున్నా కూడా కూటమిలో మాత్రం కుంపట్లు చల్లారడం లేదు. దానికి తగ్గట్లే.. నెల్లూరు జిల్లా టీడీపీలో నేతల అసమ్మతి రోజురోజుకీ బాగా ముదురిపోతోంది.ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కందుకూరు టిక్కెట్‌ టీడీపీ అధిష్టానం ఇంటూరి నాగేశ్వరరావుకి ఇవ్వగా ఛాన్స్ దక్కకపోవడంతో ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు టిక్కెట్‌ దక్కలేదనే కోపంతో రెబల్‌గా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. దానిలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఇంటూరి రాజేష్‌.. కీలక వ్యాఖ్యలని చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు.అంతేకాదు.. కందుకూరులో టీడీపీని ఓడించి తీరుతానని రాజేష్‌ శపథం చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.


టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయిన కందుకూరు రెబల్ అభ్యర్థి రాజేష్‌కి స్థానికంగా కూడా మద్దతు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత దివి శివరాం రాజేష్‌కు మద్దతు ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చిన ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పారు శివరాం. ఆయన రాజేష్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. తమ కుటుంబాన్ని దూషించిన నాగేశ్వర్ రావుకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు దివి శివరాం.అలాగే కావలిలోనూ రెబల్‌ రచ్చ ముదురుతోంది. కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య క్రిష్ణారెడ్డి బరిలో దిగుతుండగా.. బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ రెబల్‌గా పోటీకి రెడీ అయ్యారు. బీజేపీని వీడి టీడీపీ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన.. చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు నిర్ణయాన్ని తీసుకున్నారు పసుపులేటి సుధాకర్‌. రేపు నామినేషన్ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అటు.. జోరుగా ప్రచారం చేస్తున్న పసుపులేటి సుధాకర్‌ని టీడీపీ నేతలు బుజ్జగించినా కూడా ఫలితం దక్కలేదు.పైగా ఇదిచాలదన్నట్లు.. ఎన్నికల్లో పోటీ చేసి సత్తా ఏంటో చూపిస్తానన్నారు పసుపులేటి సుధాకర్‌. అందువల్ల కావలి టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి నెల్లూరు జిల్లా కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో రెబల్స్‌ బెడదతో కూటమి క్యాండేట్లు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: