ఏలూరు జిల్లా ఇండియా హెరాల్డ్ రిపోర్ట్‌... టీడీపీ, వైసీపీలో గెలిచేదెవ‌రు.. ఓడేదెవ‌రు..?

RAMAKRISHNA S.S.
- ఏలూరు, చింత‌ల‌పూడిలో టీడీపీకి ఆధిక్యం
- ఉంగుటూరులో జ‌న‌సేన‌కు ఎడ్జ్.. పోల‌వ‌రంలో వైసీపీకి క్లీయ‌ర్‌
- దెందులూరు, నూజివీడు, కైక‌లూరులో న‌రాలు తెగే ఉత్కంఠ‌
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో.. ఎక్కడెక్కడ అధికార వైసిపి.. ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య ఎత్తులో పై ఎత్తులతో రాజకీయం వేడెక్కుతుంది. పలు జిల్లాల్లో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇండియా హెరాల్డ్ ప్రత్యేక సర్వేలు.. నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏలూరు జిల్లాలో ఉన్న ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లలో చింతలపూడి ఎస్సి రిజర్వుడ్ నియోజకవర్గంతో పాటు.. జిల్లా కేంద్రమైన ఏలూరులో టీడీపీ అభ్యర్థులకు స్పష్టమైన ఆధిక్య‌త కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం చూస్తే చింతలపూడిలో సొంగా రోషన్, ఏలూరులో బడేటి చంటి టీడీపీ అభ్యర్థులుగా కాస్త ముందంజలో ఉన్న మాట వాస్తవం.

ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్న.. నూజివీడులో మాత్రం ఆయనకు పరిస్థితి అంత సానుకూలంగా లేదు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు పరిస్థితులు అనుకూలంగా కలిసి వస్తున్నాయి. దీనికి తోడు టీడీపీ సీటు రాక ఆ పార్టీ రెబల్గా పోటీ చేస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో టీడీపీకి తలనొప్పులు తప్పడం లేదు. ఇక మరో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్న కైకలూరులో గట్టి పోటీ ఉంది. కామినేని ప్రజాక్షేత్రంలో లేనప్పుడు ప్రజలకు దూరంగా ఉండటం మైనస్ గా మారింది. అదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు. అటు కుటుంబ పెత్తనం.. పార్టీలో వర్గపోరు మైనస్ గా ఉంది. ఏది ఏమైనా కైకలూరులో జ‌నాల‌లో ఉత్కంఠ నెలకొంది.

ఇక టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్ బరిలో ఉన్న దెందులూరు లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వైసిపి నుంచి పోటీ చేస్తున్నారు. అబ్బయ్య చౌదరి, ప్రభాకర్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా మెజార్టీ 5 నుంచి 8 వేల లోపు మాత్రమే ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు పై ఎవరి ధీమా వారికి కనిపిస్తోంది. కచ్చితంగా ప్రభాకర్ గెలుస్తాడు అని టీడీపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు... అబ్బాయి చౌదరి గెలుపు గ్యారెంటీ అని వైసిపి వాళ్లు చెప్పలేని పరిస్థితి ఉంది, దెందులూరు పోటి చాలా రసవత్తరంగా ఉంది.

ఇక పోలవరం ప్రాజెక్టు ఉన్న ప్రతిష్టాత్మకమైన పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో మాత్రం.. వైసీపీ కాస్త ముందంజలో ఉంది. ఇక్కడి నుంచి కూట‌మిలో భాగంగా జనసేన తరఫున చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. ఆయన అంత ఫోకస్ అయిన లీడర్ కాకపోవడంతో పాటు టీడీపీలో కొన్ని వర్గాలు జనసేనకు మనస్పూర్తిగా సహకరించే పరిస్థితి లేకపోవడంతో.. పోలవరంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తెల్లం రాజ్యలక్ష్మి లీడ్ లో కనిపిస్తున్నట్టు వాతావరణం ఉంది.

ఇక ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు సీటు త్యాగం చేసి జనసేనకు ఇచ్చిన ఉంగుటూరులో.. పరిస్థితి నిన్న మొన్నటివరకు టైట్ గా కనిపించినా.. ఇప్పుడు టీడీపీ శ్రేణులు జనసేనకు మనస్ఫూర్తిగా సహకరిస్తూ ఉండడంతో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్న పత్స‌మట్ల ధర్మరాజు కాస్త ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంటు పరంగా చూసుకుంటే వైసీపీ, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు యువనేతలు కావటం.. బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో హోరాహోరీ పోరు తప్పడం లేదు. అయితే కారుమూరి సునీల్ కుమార్ లోకల్ కావటం.. పుట్టా మహేష్ కడప జిల్లాకు చెందినవారు కావడం.. కాస్త ఇబ్బందిగా మారింది. పార్లమెంటు పరంగా చూసుకున్న ఎవరు గెలిచిన 50,000 లోపు మాత్రమే మెజార్టీ ఉంటుందన్న లెక్కలు ఇప్పటివరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: