ఆ టికెట్‌ ఎవరికో? సీఎం ఎన్నిక కూడా కాంగ్రెస్‌కు ఇంత కష్టం కాలేదుగా?

Chakravarthi Kalyan
లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను శర వేగంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ.. మూడు సీట్ల విషయంలో మాత్రం తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గానూ.. 14 స్థానాలకు అభ్యర్థులను ఈ పాటికే ఖరారు చేసిన అధిష్ఠానం ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను ఇంకా పెండింగ్ లో ఉంచింది.

ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆచుతూచి వ్యవహరిస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో కుల సమీకరణాలు అత్యంత కీలకమైనవి. ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే భావన నాయకుల్లో ఏర్పడింది. వాస్తవానికి ఖమ్మంలో ఇతర పార్టీల ప్రభావం అంతంతమాత్రమే. రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఖమ్మంపై మాత్రం పట్టు సాధించలేకపోయింది. ఇక బీజేపీ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆలస్యంగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా గెలుపు సాధ్యమేనే భావనలో అధిష్ఠానం ఉంది.

ఇక్కడ స్థానికంగా బలమైన నాయకులే కాకుండా.. స్థానికేతరులు సైతం కన్నేశారు. రేణుకా చౌదరికి ముందుగానే రాజ్యసభ సీటు ఇచ్చి ఆమెను వ్యూహాత్మకంగా సైడ్ చేశారు. ఈ సీటు కోసం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు పట్టు వీడకపోవడంతో అభ్యర్థి ఎంపికలో ఆలస్యానికి కారణం అవుతోంది. ప్రధాన పోటీ మాత్రం పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి నందిని మధ్యే నెలకొంది.

అయితే ఈ స్థానం తోనే కరీంనగర్ స్థానంలో అభ్యర్థి ముడిపడి ఉంది. ఇక్కడ బీసీలకు ఇస్తే అక్కడ ప్రవీణ్ రెడ్డికి మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ఖమ్మంలో ఓసీకి సీటు కేటాయిస్తే ఇక్కడ బీసీను కాంగ్రెస్ బరిలో నిలుపుతుంది. ఈ రెండింటికి లింక్ ముడి పడి ఉండటంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవుతుంది. కరీంనగర్ లో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. అన్ని కోణాలను పరిశీలించి అభ్యర్థుల ఎంపిక చేయనుంది. మొత్తానికి ఖమ్మంలో ఎప్పుడు సీటు ఇచ్చినా గెలుపు ఖాయమనే భావనతోనే అభ్యర్థి ఎంపిక పెండింగ్ లో ఉంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: