నంద్యాల జిల్లాలో హోరాహోరీ.. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం చూపనుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన రాజకీయ నేతలు తమ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక లోక్‌సభ నియోజకవర్గం మాత్రమే ఉంది. అయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ విభిన్న జనాభా ఉంది. ఇప్పుడు 2024లో ఓటర్లు తమ ఓటు శక్తిని చూపించడానికి మరింత ఉత్సాహంగా ఉన్నారు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో 2024 అభ్యర్థుల జాబితా విషయానికొస్తే, తెలుగుదేశం పార్టీ నుండి బైరెడ్డి శబరి, వైసీపీ నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి అభ్యర్థులుగా ఉన్నారు. వీరి మధ్య మాత్రమే ప్రధానంగా పోటీ సాగనుంది. ఇద్దరూ బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. ఆర్థిక, అంగ బలం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇరు పార్టీలు ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎవరు ఇక్కడ విజేతగా నిలుస్తారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఇప్పటి వరకు బీజేపీలో ఉన్న బైరెడ్డి శబరిని టీడీపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. టీడీపీలోకి వస్తే లోక్‌సభ సీటు ఇస్తామని ఆఫర్ చేసింది. దీంతో ఆమె ఆ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోంది. ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ప్రాంతంలో వీరిది రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబం. దీంతో తమ పార్టీ గెలుపు అవకాశాలను మరింత పెంచుకునేందుకు టీడీపీ ఆమెను బరిలోకి దింపింది. మరో వైపు సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తోంది. ఈ పార్టీ నుంచి అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, నందికొట్కూరు, డోన్‌, పాణ్యం అసెంబ్లీ స్థానాలున్నాయి. నంద్యాల అసెంబ్లీ పరిధిలో వైసీపీ నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, టీడీపీ నుంచి ఫరూఖ్ పోటీలో ఉన్నారు. ఆళ్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బిజేంద్ర రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పోటీ చేస్తున్నారు. బనగానపల్లెలో వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి, టీడీపీ నుంచి బీసీ జనార్థన్ బరిలో నిలిచారు. డోన్‌‌లో వైసీపీ అభ్యర్థిగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డి గెలుపు కోసం బరిలోకి దిగారు. శ్రీశైలం విషయానికొస్తే వైసీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ నుంచి బి.రాజశేఖర్‌ రెడ్డి పోటీకి దిగారు. నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థిగా దారా సుధీర్, టీడీపీ అభ్యర్థిగా గిత్తా జయసూర్య తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. మొత్తం టీడీపీ అభ్యర్థులు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని నమ్ముతున్నారు. వైసీపీ అభ్యర్థులు సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తామని గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: