పొత్తులను చిత్తు చేయడానికి జగన్ వ్యూహాలివే.. 2019 మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం తెలివిగా వ్యూహాలను అమలు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో పేరుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులను చిత్తు చేయడానికి జగన్ తన మార్క్ వ్యూహాలతో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఎక్కడికెళ్లినా తన పాలన వల్ల మంచి జరిగితే మాత్రమే ఓటేయండని చెబుతూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జగన్ పాలనలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలలో చాలామందికి పథకాలు అందాయి.
 
మహిళలు, పేద, నిరుపేదలు జగన్ కు అనుకూలంగా ఉండగా ఆ ఓటు బ్యాంక్ వైసీపీకి మాత్రమే ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. వాలంటీర్లకు వేతనాల పెంపు, వృద్ధులు దివ్యాంగులకు పింఛన్ల పెంపు అంటూ బాబు హామీలు ఇస్తున్నా జగన్ మాత్రం అలాంటి హామీలకు దూరంగా ఉంటున్నారు. ఏపీ బడ్జెట్ లెక్కల ప్రకారం ఏ హామీ ఇస్తే ఎంత ఖర్చవుతుందో జగన్ కు బాగా తెలుసు. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు కాబట్టి వేతనాలు పెంచినా పెంచకపోయినా నష్టం లేదని జగన్ ఫీలవుతున్నారు.
 
వృద్ధులు, దివ్యాంగులకు బాబు ఇచ్చిన పింఛన్ల పెంపు హామీ  వల్ల బెనిఫిట్ కలిగినా కూటమి అధికారంలోకి వస్తే ఇతర పథకాలు ఆగిపోతాయనే భయం ఉంది. ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే రోడ్ల మంజూరు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయడంతో చాలామంది వైసీపీ నేతలు తమను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని హామీలు ఇస్తున్నారు. వైసీపీ నేతలలో చాలామంది ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తూ ఓటర్ల సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
 
జగన్ ప్రచారంలో భాగంగా పవన్ పెళ్లిళ్లపై విమర్శలు చేయడం కూడా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. సినిమా రంగంలో ఎప్పుడూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోని పవన్ పై ఘాటుగా విమర్శలు చేయడం ద్వారా పవన్ ఆత్మస్థైర్యం దెబ్బ తీసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో పవన్ విమర్శలను జగన్ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నిస్తూ 14 ఏళ్ల బాబు పాలనలో ప్రజలకు మంచి జరగలేదని జగన్ చెప్పకనే చెబుతున్నారు.
 
మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడుతున్న జగన్ ఆ సర్వేల ఫలితాలను నిజం చేయడానికి అహర్నిషలు శ్రమిస్తున్నారు. కూటమి ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని విమర్శలు చేసినా వైసీపీదే విజయమని పదేపదే చెబుతూ కార్యకర్తల్లో, నేతల్లో స్పూర్తి నింపడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల సీట్లు దక్కని నేతలకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ ఇస్తూ జగన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 2019 మ్యాజిక్ ను రిపీట్ చేయాలని భావిస్తున్న జగన్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: