మంత్రి కారుమూరి ఖచ్చితంగా ఓడిపోయే లిస్టులోనే ఉన్నారా... తణుకులో ఆరిమిల్లి మెజార్టీ ఎంత..!
- తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిన మంత్రి అంటూ ప్రచారం..?
- క్లీన్ ఇమేజ్‌తో 5 ఏళ్లు పాలన చేసిన ఆరిమిల్లిపై జనాల్లో ఫుల్ క్రేజ్
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
కారుమూరి నాగేశ్వరరరావు జగన్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నుంచి అసెంబ్లీకి ప్రాథినిత్యం వహించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి తణుకు ఎమ్మెల్యేగా స్వల్ప తేడాతో గెలిచిన ఆయన 2014లో వైసీపీ నుంచి దెందులూరు లో ఓడిపోయినా 2019లో మళ్లీ తణుకు నుంచి స్వల్ప తేడాతోనే గెలిచారు. అంత జగన్ ప్రభంజనం ఉన్నా కూడా కారుమూరి మెజార్టీ వెయ్యి లోపే ఉంది.
ఇక్కడ కారుమూరి రెండు సార్లు గెలవడం వెనక 2009లో ప్రజారాజ్యం.. 2019లో జనసేన ఎంతో సాయం చేశాయి. ప్రజారాజ్యం పార్టీకి 43 వేల ఓట్లు వచ్చాయి. అప్పుడు కారుమూరి వెయ్యి లోపు ఓట్లతో బయటపడ్డారు. 2019లో జనసేనకు 32 వేల పై చిలుకు ఓట్లు రావడంతో మళ్లీ అంతే స్వల్ప మెజార్టీతో గెలిచారు. తొలి మూడేళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా.. తర్వాత ఆయన ప్రక్షాళనలో మంత్రి అయ్యారు.
కారుమూరి మంత్రి అయ్యాక నియోజకవర్గంలో అవినీతి పురులు విప్పేసి నాట్యం చేసిందనే విమర్శలు తీవ్రం అయ్యాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ల నుంచి మున్సిపాల్టీ పరిధిలో ఏ కట్టడం కట్టుకోవాలనుకున్నా.. నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టుల తో పాటు పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా లక్షలతో మొదలు పెట్టి కోట్లాది రూపాయలు కప్పం వసూళ్లు జరిగాయనే విమర్శలు ఉన్నాయి. ఈ వసూళ్లలో కారుమూరి గ్యాంగ్ చేసినా పేరంతా కారుమూరి మీదకే వెళ్లి పోయింది.
ఇక తాజా ఎన్నికల్లో ఆయన పూర్తిగా వ్యతిరేకతతో కొట్టు మిట్టాడుతున్నారు. ఇక జనసేన - బీజేపీ పొత్తు ఉండడంతో ఓట్లు చీలకపోతే కారుమూరి కష్టమే అని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. దీనికి తోడు కారుమూరి కుమారుడు సునీల్ ఏలూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన తణుకుకు దూరంగా ఉండడంతో కారుమూరి ఒక్కడే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ స్వతహాగా సౌమ్యుడు అన్న పేరు ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో తణుకులో చాలా అభివృద్ధి పనులు చేశారు. పైగా తనపై ఎలాంటి మరకలు, మచ్చలు లేకుండా మంచి పాలన చేసి భేష్
అనిపించుకున్నారు.
ఈ సీటు జనసేన నుంచి విడివిడ రామచంద్రరావు ఆశించినా పవన్, బాబు అనుకుని మరీ రాధాకే ఇచ్చారంటే రాధాకు ఇక్కడ ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి తణుకులో మంత్రి కారుమూరి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ సర్కిల్స్‌లోనే తణుకు సీటుపై ఆశలు లేవు.. కారుమూరి ఎంత తేడాతో ఓడతాడు అన్నదే ఇక్కడ జూన్ 4 చూడాల్సిన విషయం అంటున్నారు. తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయిస్తే ఎంత అద్భుతమో తణుకులో కారుమూరి గెలిస్తే కూడా అంతే అద్భుతం అనుకోవాలి.