ప్ర‌కాశం: అక్క‌డ టీడీపీ స్వామి హ్యాట్రిక్ ప‌క్కానా... వైసీపీ మంత్రి ఇంటికే...?

RAMAKRISHNA S.S.
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థి డోల బాల వీరాంజనేయ స్వామి గెలుపు ఖాయమంటున్నారు స్థానికులు. ఇందుకు ప్రధాన కారణం... స్వామి తీరుతో పాటు వైసీపీ అభ్యర్థి కూడా. టీడీపీ తరఫున డోల బాల వీరాంజనేయ స్వామి పోటీ చేస్తుండగా... వైసీపీ తరఫున మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేస్తున్నారు. డోల స్థానికుడు కాగా... సురేష్‌ మాత్రం మార్కాపురం పట్టణానికి చెందిన నేత. మార్కాపురం కొండపి మధ్య సుమారు 140 కిలోమీటర్ల దూరం ఉంది. పైగా ప్రతి ఎన్నికల్లో సురేష్ నియోజకవర్గం మారుస్తాడనే ప్రచారం కూడా ఉంది.
యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచారు సురేష్. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అయినా సరే.. ఆయన రెండు నియోజకవర్గాలకు చేసింది ఏమి లేదనే ప్రచారం ఉంది. అదే సమయంలో వైసీపీలో గ్రూప్ రాజకీయాలు కూడా ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. నిన్నటి వరకు ఇంఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబును సడన్‌గా వేమూరు మార్చారు జగన్. అశోక్‌ బాబు స్థానంలో సురేష్‌ను ఎంపిక చేశారు. దీంతో స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు అధినేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
 స్థానికులను కాదని... ఇతర ప్రాంతాల నేతకు ఎలా సహకరిస్తామని ఇప్పటికే నియోజకవర్గంలో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక డోల బాలవీరాంజనేయ స్వామికి నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం అండ ఉంది. మాజీ మంత్రి దామాచర్ల ఆంజనేయులు కుటుంబం డోల బాలవీరాంజనేయ స్వామికి పూర్తి అండ. వీటికి తోడు సౌమ్యుడనే పేరు ఉంది. టీడీపీకి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు. పనుల విషయంలో కూడా పార్టీలకు అతీతంగా పని చేస్తారనే పేరు డోల సొంతం. ఈసారి గెలిస్తే... ఎస్సీ కోటాలో డోలకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కూడా నడుస్తోంది.
డోల బాలవీరాంజనేయ స్వామికి దామాచర్ల సత్య అండ ఉంది. నియోజకవర్గంలో సత్య మాట దాటి డోల అడుగు వేయరనేది బహిరంగ రహస్యం. దీంతో పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది అనే మాట వాస్తవం. అయినా.. పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు డోల బాల  వీరాంజనేయ స్వామి పైన లేవు. దీంతో రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ అభ్యర్థి డోల బాల వీరాంజనేయ స్వామి గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: