ఒంగోలు: గెలుపు పార్టీ మారిన మాగుంటదా... చిత్తూరు నుంచి వచ్చిన చెవిరెడ్డిదా ?
ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తుండగా... వైసీపీ తరఫున చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త వ్యక్తి కావడంతో చెవిరెడ్డికి కేవలం పార్టీ గుర్తు మాత్రమే కలిసి వచ్చే అంశం. అదే సమయంలో మాగుంటకు మాత్రం టీడీపీతో పాటు వ్యక్తిగత ఇమేజ్ కూడా కావాల్సినంత ఉంది. కనిగిరి, పొదిలి, దర్శి, ఒంగోలు, కొండపి ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి మాగుంట కుటుంబం ఎంతో ప్రయత్నం చేసింది. సొంతగా ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేసిన విషయాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు.
అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో ఎన్నో విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేశారు దివంగత ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి. ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. ఇక 1996లో మాగుంట సుబ్బరామిరెడ్డిని మావోయిస్టులు హత్య చేశారు. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంది. ప్రధానంగా కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాగుంటకు పార్టీలకు అతీతంగా స్పష్టమైన మెజారిటీ వస్తుంది.
కొంతమంది వైసీపీ సర్పంచులు ఇప్పటికే మాగుంటకు అనుకూలంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేయాలని.. అలాగే ఎంపీ ఓటు మాత్రం మాగుంటకు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. వీటన్నిటికి తోడు... మాగుంట రాఘవరెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో పెట్టారనే సానుభూతి కూడా కొంత ఉంది. విజయసాయిరెడ్డి అల్లుడిని వదిలేసి.. రాఘవరెడ్డిని మాత్రమే బలి పశువు చేశారనేది ఈ ప్రాంతంలో వినిపిస్తున్న మాట. ఇది కూడా మాగుంటకు కలిసివచ్చే అంశం. ఆర్థికంగా కూడా అటు చెవిరెడ్డి, ఇటు మాగుంట బలమైన వ్యక్తులే.
తాయిలాలు పంచటంలో చెవిరెడ్డిని మించిన వారు లేరనే మాట బహిరంగ రహస్యం. ఇప్పటికే పెద్ద ఎత్తున సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు కూడా. అయితే ఇవన్నీ కేవలం పది శాతమే అంటున్నారు. ఎన్నికల నాటికి ఇంకా వస్తాయంటున్నారు వైసీపీ నేతలు. తాయిలాల పంపకం కూడా నియోజకవర్గంలో ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తానికి ఒంగోలు పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా ఉన్నప్పటికీ... గెలుపు మాత్రం మాగుంట శ్రీనివాసులురెడ్డిని వరిస్తుందనే మాట వినిపిస్తోంది.