విశాఖ: భీమిలీలో పోటీ రసవత్తరం?

Purushottham Vinay
5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ముందు వచ్చి గెలిచాక జనం ముఖం చూడని నేత అంటూ గంటా శ్రీనివాసరావు మీద వైసీపీ భీమిలీ ఎమ్మెల్యే అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు కోపంతో నిప్పులు చెరుగుతున్నారు. ఆయన 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. అసలు ఏమైనా మేలు జనాలకు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ ఎన్నికకు కూడా నియోజకవర్గాన్ని మారుస్తూ తిరిగే గంటాను ప్రజలు నమ్మరని అవంతి ఘాటు విమర్శలు చేశారు.అయితే అవంతి విమర్శలకు మాత్రం గంటా ఏమాత్రం అసలు రెస్పాండ్ కావడంలేదు. చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. వైసీపీ నుంచి కొందరు కీలక నేతలను లాగేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు భీమిలీలో ఇంకా కాలు మోపలేదు. కానీ వైసీపీ నేతలనే విశాఖలో ఉన్న తన ఇంటికి రప్పించి మరీ వారికి కండువాలు కప్పుతున్నారు.భీమిలీలో తన గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం 2014 వ సంవత్సరంలో గంటాకు 37 వేల పై చిలుకు మెజారిటీ ఇక్కడ వచ్చింది. అందువల్ల గంటా ధీమాగా ఉన్నారు. కానీ పది సంవత్సరాల కాలం గడచింది. అప్పుడు ఉన్న వారు ఇప్పుడు మారిపోయారు పైగా పార్టీల బలాబలాలలో తేడాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.


ఇక పోతే అవంతి శ్రీనివాసరావు కూడా ఏమీ తక్కువ వారు కాదు. ఆయన కూడా ఓటమనేది ఎరగని నేతగానే ఉన్నారు. 2009 వ సంవత్సరంలో భీమిలీ నుంచే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 వ సంవత్సరంలో అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. 2019 వ సంవత్సరంలో తిరిగి భీమిలీలో ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అయ్యారు. అంటే అవంతి కూడా గంటాకు తగిన వారే. ఇద్దరికీ కూడా ఓటమి ఎరగని చరిత్ర ఉంది.ఇక గంటా వర్సెస్ అవంతి అంటే ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు అంటే చెప్పలేము. అయితే టీడీపీలోనే గంటాకు అసంతృప్తి సెగలు ఉన్నాయి. మాజీ ఎంపీపీ భీమిలీ టీడీపీ ఇంచార్జ్ కోరాడ రాజబాబు  టికెట్ దక్కలేదు కారణం చెప్పమని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన సహకారం గంటాకు ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్ధకం అంటున్నారు. మొత్తానికి భీమిలీలో అవంతి, గంటా మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. ఎవరు గెలుస్తారు అన్నది చెప్పడం కష్టమే. జనాలు ఎవరిని గెలిపిస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: