ఆమంచి: 2014 మ్యాజిక్ రిపీట్‌కు రెడీ... ఒక్క‌సారిగా మారిన చీరాల రాజ‌కీయం..?

RAMAKRISHNA S.S.
ఇప్పటివరకు చాలా సైలెంట్‌గా ఉన్న బాపట్ల జిల్లాలోని చీరాల రాజకీయం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన ఒకే ఒక ప్రకటనతో వేడెక్కింది. వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆమంచి.. ఈనెల 9వ తేదీన తన రాజకీయ కార్య చరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆమంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? ఆయన తీసుకునే నిర్ణయంతో చీరాల రాజకీయం ఎలా వేడెక్కబోతుంది అన్నది ఆసక్తిగా మారింది. చీరాల రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా ఆమంచి ది తిరుగులేని రాజకీయ ప్రస్థానం. వేటపాలెం జడ్పిటిసీగా కెరీర్ మొదలుపెట్టిన ఆమంచి.. వరుసగా చీరాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అందులోనూ 2014లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఓడించి ఇండిపెండెంట్గా ఆయన గెలవటం సెన్సేషనల్ రికార్డ్‌ అని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లిన ఆమంచి.. అక్కడ ఓడిపోయారు. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీ చెంత చేరడంతో.. ఆమంచికి చీరాల రాజకీయాలలో ఇబ్బందులు ఎదురయ్యాయి. జగన్ మధ్యే మార్గంగా ఆయనను పరిచూరు ఇన్చార్జిగా పంపారు. ఈ ఎన్నికల్లోను ఆయనను పరుచూరు నుంచే పోటీ చేయమని ఆదేశించారు. తన సొంత అడ్డ అయినా చీరాలను కాదని పరుచూరులో పోటీ చేసేందుకు ఇష్టం లేని ఆమంచి జగన్‌కు నేరుగానే ఈ విషయం చెప్పేశారు.

చీరాల సీటు దక్కలేదు. గత నెల రోజుల నుంచి ఆమంచి షాకింగ్ నిర్ణయం తీసుకుంటారు అన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది. అందరి అంచనాలకు అనుగుణంగానే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఈనెల 9వ‌ తేదీన తన అభిమానులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్న ఆమంచి చీరాల అసెంబ్లీ పోరులో ఇండిపెండెంట్గా బరిలోకి దింపటం దాదాపు ఖరారు అయినట్టే. చీరాలలో ఆయనకు వ్యక్తిగతంగా తిరుగులేని బలం ఉంది. సొంత అనుచరగణం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పటికీ వ్యక్తిగత ఇమేజ్ స్ట్రాంగ్‌గా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు.

ఇక వైసీపీ విషయానికి వస్తే వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెన్నంటే ఉన్న కొందరు వీరాభిమానులు.. ప్రస్తుత వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ తో అంత సఖ్యతతో ఉండటం లేదు. కేవలం కరణం వెంట వచ్చిన క్యాడర్ మాత్రమే ఆయనతో ఉంటుంది. ఇటు టీడీపీ నుంచి నాన్ లోకల్ అయినా ఎం .ఎం. కొండయ్యకు సీటు కేటాయించారు. నిజం చెప్పాలంటే చీరాల నియోజకవర్గ ప్రజలతో పాటు మెజార్టీ తెలుగుదేశం కేడర్ కూడా కొండయ్య అభ్యర్థిత్వం విషయంలో అంత సానుకూలంగా లేరు. రెండు పార్టీలలోనూ ఉన్న రాజకీయ శూన్య‌తను ఆధారంగా చేసుకుని ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆమంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి.

ఇదే ఇప్పుడు చీరాల రాజకీయాల్లో బాగా హాట్‌ టాపిక్ గా మారింది. ఆమంచి కూడా తెలుగుదేశం వైసీపీ అభ్యర్థుల ప్రకటన వచ్చేవరకు వేచి చూశారు. చీరాలలో ఇప్పుడున్న పరిస్థితులలో.. వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ పట్ల ఆ పార్టీ వాళ్లు.. చీరాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే టైంలో ఇటు టీడీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్ విషయంలోనూ టీడీపీ వాళ్ళు.. చీరాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ టైం లో లోకల్ అభ్యర్థిగా.. అందులోను సొంత ఇమేజ్ ఉన్న ఆమంచి పోటీ చేస్తే.. 2024లో గెలిపించుకుందామన్న చర్చలు కూడా మొదలయ్యాయి.

విచిత్ర ఏమిటంటే రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయ వేడి మామూలుగా లేదు. చీరాల రాజకీయ మాత్రం ఇంకా చాలా స్త‌బ్ధుగా ఉంది. ఈ టైంలో ఆమంచి వైసీపీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయం వేడెక్కింది. ఆ మంచి ఇండిపెండెంట్గా పోటీలో ఉంటే చీరాలలో ముక్కోణపు పోటీతో రాజకీయం మామూలుగా ఉండదనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ నెల 9న ఆమంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలలో ఆసక్తిగా మారింది.b

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: