ఘోర తప్పిదాలు చేస్తున్న బాబు.. కూటమి ఓడితే పాపం ఆయనదేనా?

Reddy P Rajasekhar
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పు మీద తప్పు చేస్తూ తప్పటడుగులు వేస్తూ పార్టీని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి వల్ల కలిగిన భయమో లేక 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకపోతే జైలు శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుందనే భావనో తెలీదు కానీ చంద్రబాబు చేస్తున్న ఘోర తప్పిదాలు పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి.
 
వాలంటీర్ల విషయంలో మారిన మాట : గతంలో వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీఇన్నీ కావు. వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే అనే భావన కలిగేలా చంద్రబాబు కామెంట్లు చేశారు. అయితే ఎన్నికల సమయానికి వాలంటీర్ల వ్యవస్థ అద్భుతమని పరోక్షంగా ఆయనే చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని బాబు హామీ ఇస్తున్నారు. అయితే ఓట్ల కోసమే చంద్రబాబు మాట మార్చారనే భావన మాత్రం వాలంటీర్లలో ఉంది.
 
జనసేన విషయంలో తప్పటడుగులు : టీడీపీ జనసేన పొత్తు వల్ల టీడీపీకి ఊహించని స్థాయిలో లాభం కలిగితే జనసేన తీవ్రస్థాయిలో నష్టపోయింది. జనసేన నుంచి టికెట్లు ఆశించిన చాలామంది నేతలకు టికెట్లు దక్కలేదు. ఈ నేతలు చంద్రబాబు వల్లే తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. టికెట్లు దక్కని జనసేన నేతలను బుజ్జగించటానికి అటు బాబు ఇటు పవన్ ప్రయత్నాలు చేయలేదు. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కావడం సులువు కాదని తెలుస్తోంది.
 
సూపర్ సిక్స్ హామీల్లో కొత్తదనం లేకపోవడం : వైసీపీ నవరత్నాలను ప్రకటించిన సమయంలో ఆ పథకాలలో చాలా పథకాలు ప్రజలకు పెద్దగా పరిచయం లేని పథకాలు కావడంతో ఆ పథకాలపై ప్రజల్లో సైతం ఆసక్తి కలిగింది. టీడీపీ సూపర్ సిక్స్ లో భాగంగా ప్రకటించిన పథకాలన్నీ వైసీపీ, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలే కావడంతో ఈ పథకాల కంటే నవరత్నాల స్కీమ్స్ వల్లే ఎక్కువ బెనిఫిట్ కలుగుతుందని ఓటర్లు భావిస్తున్నారు.
 
రఘురామ కృష్ణంరాజుకు అధిక ప్రాధాన్యత : టీడీపీలో ఎంతోమంది నేతలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని బాబు నరసాపురం ఎంపీ సీటును రఘురామ కృష్ణంరాజుకు ఇప్పించాలని ఇప్పటికీ చేస్తున్న ప్రయత్నాలపై బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. రఘురామ కృష్ణంరాజు తీరు నచ్చక ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని భోగట్టా. అయితే బాబు మాత్రం రఘురామకు ఏదో విధంగా న్యాయం చేయాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు.
 
ఐవీఆర్ఎస్ సర్వేలపై ఆధారపడటం : సాధారణంగా ఏ పార్టీ అయినా సర్వే అంటే ఓటర్లను కలిసి వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అయితే బాబు మాత్రం ఎక్కువ సంఖ్యలో నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలపై ఆధారపడ్డారు. ఒకే ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే ఆప్షన్ గా ఇచ్చి చంద్రబాబు సర్వేలను నిర్వహించడంపై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.
 
ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకపోవడం : ఐదేళ్ల వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో తరచూ విమర్శలు చేసే చంద్రబాబు ప్రజలు వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంపై కానీ ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడం కానీ చేయలేదు. సంపద సృష్టించి ప్రజలకు మేలు చేస్తానన్న చంద్రబాబు ఆ సంపద ఎలా సృష్టిస్తారో మాత్రం చెప్పడం లేదు.
 
ఆచరణ సాధ్యం కాని హామీల ప్రకటన : 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో మెజారిటీ హామీలను చివరి ఆరు నెలల్లో మాత్రమే మెజారిటీ పథకాల అమలు జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు అంటూ చంద్రబాబు చెబుతున్నా ఆచరణలో ఎలా సాధ్యమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వేల సంఖ్యలో కంపెనీలు ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన సాధ్యం కావడం లేదు.
 
అన్న క్యాంటీన్ల విషయంలో నోరు మెదపని బాబు : జగన్ సర్కార్ అన్న క్యాంటీన్లను కొనసాగించకపోవడంపై అప్పట్లో టీడీపీ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. అన్న క్యాంటీన్ల వల్ల కడుపేదలకు కచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ స్కీమ్ గురించి బాబు ఎలాంటి ప్రకటన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
అన్నదాత స్కీమ్ విషయంలో కొరవడిన స్పష్టత : కూటమి అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెబుతున్న బాబు మోదీ సర్కార్ ఇచ్చే పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులతో కలిపి అన్నదాత స్కీమ్ ద్వారా నగదు జమ చేస్తారా లేక అన్నదాత స్కీమ్ ద్వారా మాత్రమే 20,000 ఇస్తారా అనే కన్ఫ్యూజన్ కు తెరదించాల్సి ఉంది.
 
చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అమలు చేస్తానని ఇచ్చిన హామీ విషయంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఆటో డ్రైవర్లకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పి ఉంటే బాగుండేది. తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రస్థాయిలో నష్టపోయారు. ఈ ఘోర తప్పిదాలపై బాబు దృష్టి పెట్టకపోతే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ఓడినా పాపం ఆయనదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: