పాడిన పాటే పాడుతున్న జగన్?

Purushottham Vinay
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తాజాగా వైసీపీ అధినేత సీఎం జగన్‌.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో పర్యటించి.. 'మేం సైతం సిద్ధం' సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నికలు తనకు-చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కావని  ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.ఈ యుద్ధంలో ప్రజల పక్షాన ఉన్నానని చెప్పడానికి గర్విస్తున్నాని అన్నారు.


ఇంకా జగన్ మాట్లాడుతూ.. "ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి.. ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ(కాంగ్రెస్‌), ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ(బీజేపీ). వీళ్లందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర ప్రజల పక్షం... వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధానికి వస్తున్నారు'' అని జగన్ ప్రసంగంలో అన్నారు.ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం ఒక వైపున ఉన్నాయని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరో వైపున ఉన్నాయని అన్నారు. ''మంచి ఓ వైపున, చెడు ఓ వైపున.. వెలుగు ఒక వైపున, చీకటి మరో వైపున... ధర్మం ఒకవైపున, అధర్మం మరో వైపున ఉన్నాయి'' అని జగన్ అన్నారు. ఈ రెండు ప్రత్యామ్నాయాల గురించి ప్రతి ఇంట్లో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.


''అధికారాన్ని ఉపయోగించి ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరిసేలా చేసిన మన ప్రభుత్వ ఒకవైపున ఉంది. గతంలో మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ, అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి... వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్టుగా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున ఉంది'' అని జగన్ వ్యాఖ్యలు చేశారు. ''మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మీ బిడ్డకు మీరు తోడుగా నిలవాలి.ఈసారి ఏకంగా 175కి 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25కి 25 లోక్ సభ స్థానాలు గెలిపించుకుని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కారును సాధించేందుకు మీరంతా సిద్ధమేనా?'' అని గత నాలుగు రోజుల నుంచి పడుతున్న పాటే మళ్ళీ ఇప్పుడు కూడా పాడారు. మీరు వేసే ఓటుతో ఐదేళ్ల జీవితం ప్రభావితమవుతుందని జనాలతో అన్నారు. ఇంకా అంతేకాదు, మీరు వారికి ఓటేస్తే 1825 రోజులు మీ భవిష్యత్తును వాళ్ల చేతిలో పెట్టినట్టేనని జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: