ఏపీ: వికలాంగులు, వృద్దుల ఉసురు బాబుకి తప్పక తగులుతుంది?

Suma Kallamadi
ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆంధ్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. అధికార వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేసారని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఒకవైపు ఆరోపిస్తుంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబు అనేక సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వృద్దులకు, వికలాంగులకు అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వాలంటీర్లు తమతమ ఇంటికి తీసుకు వెళ్లి మరీ ఇచ్చేవారు. అయితే ఎన్నకల కోడ్ అమల్లో ఉండడంతో వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచారు.
ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఈ మార్పు వలన వృద్దులు, వికలాంగులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు వృద్దులు, వికలాంగులు చాలా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సచివాలయాలకు రాలేని వాళ్ళు కూడా ప్రస్తుతం పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లక తప్పడం లేదని.. అలా వెళ్లడం తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని అంగవైకల్యం కలిగిన ఓ వ్యక్తి తాజాగా సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆ వ్యక్తి మాటలను మంత్రి అంబటి రాంబాబు వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఇంకేముంది, కట్ చేస్తే ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంబటి రాంబాబు ఆ వీడియోని షేర్ చేస్తూ... ఆ వీడియోకి "వృద్దులు, వికలాంగుల ఉసురుకొట్టి పోతాడు బాబు!" అనే ట్యాగ్ ను జతచేసారు. దాంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. ఏది ఏమైనా ఈ పెన్షన్ల విషయం మాత్రం ప్రస్తుతం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే అవకాశాన్ని తీసుకొని వైసీపీ చంద్రబాబుపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం ఎక్కడ మొదలైందంటే రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. అదిగో ఆ తరువాతే ఈ పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: