ఏపీ: జగన్ బస్సు యాత్రలో ఇవి హైలైట్.. జబర్దస్త్ స్కిట్లను మించిన కామెడీ...?

Suma Kallamadi
ఏపీ సీఎం వైఎస్ జగన్ తన పార్టీ వైసీపీని మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభించారు. అయితే ఈ బస్సు యాత్రలో జరుగుతున్న కొన్ని పరిణామాలు నవ్వు పుట్టించేలా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం తర్వాత వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన పరదాల చాటున పర్యటనలు కొనసాగించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే బస్సు యాత్రను కేవలం సోషల్ మీడియాలో ప్రచారానికే చేపడుతున్నారనే భావన చాలా మందిలో కలుగుతోంది. ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలు దానిని బలపరుస్తున్నాయి. తొలి రెండు రోజులు జరిగిన టూర్ అంతా స్క్రిప్టెడ్ అనే విమర్శలు వస్తున్నాయి. కేవలం సాయంత్రం మాత్రమే, చీకటి పడక ముందు గంటన్నర పాటు ఆయన ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం లేదు. ఇదిలా ఉండగా ఆయన బస్సు చుట్టూ కొందరు స్కిట్స్ ప్రదర్శించడం అందరికీ నవ్వు పుట్టిస్తోంది. ఇవి మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా యథాతథంగా కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రికి పటిష్ట భద్రత ఉంటుంది. సామాన్యులు ఆయన వాహనాలు, కాన్వాయ్ వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి భద్రతా సిబ్బంది అనుమతించరు. సీఎంకు ముప్పు ఉంటుందనే కారణంతో ఆంక్షలు విధిస్తారు. అయితే ఇవేమీ ప్రస్తుతం బస్సు యాత్రలో కనిపించడం లేదు. కొందరు బస్సుకు దగ్గరగా పొర్లు దండాలు పెడుతున్నారు. వాటిని చూసి సీఎం జగన్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారందరి జీవితాలను తాను మార్చాననే రీతిలో జగన్ నవ్వులు చిందిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా స్క్రిప్టెడ్ ఘటనలను చూసి అంతా నవ్వుకుంటున్నారు. ఐ ప్యాక్ టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం కొందరు పార్టీ జెండాలతో పొర్లు దండాలు పెట్టడంతో పాటు బస్సు వెనుక పరుగులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో కొంచెం ఫాలోయింగ్ ఉన్న వాళ్లను వైసీపీ వాళ్లు తీసుకొస్తారు. ఆ సోషల్ మీడియా స్టార్లు జగన్ బస్సు వద్ద విచిత్రమైన కాన్సెప్టులతో షూటింగ్ చేస్తున్నారు. ఇలా మహిళలు, దివ్యాంగులు, సోషల్ మీడియా స్టార్లతో జబర్దస్త్‌ను మించి పోయేలా స్కిట్స్ ప్రదర్శిస్తుండడంతో అవి కడుపుబ్బా నవ్వు పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజల్లోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నించలేదు. ఎన్నికల సమయం కావడంతో బస్సు యాత్రతో జనాల్లోకి ఆయన వస్తున్నారు. ఓ పక్క ఐ ప్యాక్ టీమ్ స్క్రిప్టులతో కొందరు సోషల్ మీడియాలో వైసీపీకి లేని ఊపును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాస్తవానికి జాబ్ క్యాలెండర్లు లేవని నిరుద్యోగులు, ఖాళీ బిందెలు పట్టుకుని మహిళలు నిరసన చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని పోలీసులు ముందే అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి వాటికి సంబంధించినవి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: