రాయలసీమ : పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందట.. ఈ సెంటిమెంట్ బ్రేకవుతుందా?

Reddy P Rajasekhar
ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీని డిసైడ్ చేయడంలో రాయలసీమ పాత్ర ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాయలసీమలో ఎక్కువ స్థానాలలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి విజయావకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు. అయితే సీమలోని ఉరవకొండ నియోజకవర్గంలో దశాబ్దాల నుంచి ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదు.
 
వినడానికి ఈ సెంటిమెంట్ కొంచెం వెరైటీగా అనిపించినా ఈ సెంటిమెంట్ మాత్రం బ్రేక్ కావడం లేదు. 2004 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ పోటీ చేయగా ఆయన 8255 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై విజయం సాధించడం జరిగింది. 2009 శాసనసభ ఎన్నికల్లో సైతం పయ్యావుల కేశవ్ కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 229 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి వార్తల్లో నిలిచారు.
 
అయితే పయ్యావుల 2004, 2009 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా గెలిచినా రాష్ట్రంలో మాత్రం టీడీపీ అధికారంలోకి రాలేదు. 2014 ఎన్నికల్లో పయ్యావులకు 78,767 ఓట్లు రాగా ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డికి 81,042 ఓట్లు వచ్చాయి. అయితే పయ్యావుల ఓడినా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించారు.
 
రాయలసీమలో కుప్పం, హిందూపురం, ఉరవకొండలలో మాత్రమే 2019 ఎన్నికల్లో టీడీపీ అనుకూల ఫలితాలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం టీడీపీకి సైతం షాకిచ్చింది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల వైసీపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటాపోటీ ఉండనుందని ఎవరు గెలుస్తారో చెప్పలేమని సర్వేలు చెబుతున్నాయి. పయ్యావుల గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చి ఈ నెగిటివ్ సెంటిమెంట్ బ్రేక్ కావాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: