గోదావ‌రి: త‌న సీట్లో పవన్ పార్టీను గెలిపిస్తాన‌ని శ‌ప‌థం చేసిన టీడీపీ టాప్ లీడ‌ర్‌.. !

RAMAKRISHNA S.S.
తెలుగుదేశం - జనసేన - బిజెపి పొత్తు నేపథ్యంలో చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు అయ్యాయి. పొత్తులో భాగంగా పలువురు కీలక నేతలు తమ సీట్లను త్యాగం చేయక తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజనేయులు సైతం తన సీటు త్యాగం చేయక తప్పలేదు. రెండున్నర దశాబ్దాలుగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బ్రతికించుకుంటూ వస్తున్న ఆయన ఉంగుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగాను.. అటు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు.
గత మూడున్నర సంవత్సరాలుగా ఏలూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు తెచ్చారు. ఏమాట‌కు ఆ మాట సొంత నియోజకవర్గం ఉంగుటూరుతో పాటు చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పార్టీకి ఫుల్ జోష్ రావడంలో ఆంజనేయులు పడిన కష్టం వెలకట్టలేనిది. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఉంగుటూరు నియోజకవర్గం కేటాయించారు. ఆంజనేయులు ముందు కాస్త ఆవేదన చెందినా చంద్రబాబు పిలిచి స్వయంగా హామీ ఇవ్వడంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నీ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలలో పార్టీ గెలుపు కోసం పని చేయి.. నీ కష్టం వృధా పోదు.. నీ భవిష్యత్తు నాది అని హామీ ఇవ్వడంతో ఆంజనేయులు పొత్తు ధర్మం పాటించి ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి మద్దతు ఇస్తానని ప్రకటించారు.
ఆ వెంటనే టీడీపీ కేడ‌ర్‌తో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి పొత్తుధర్మం పాటించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన అభ్యర్థికి సహకరించాలని తీర్మానించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు జనసేన పార్టీ అభ్యర్థి ధర్మరాజు తో కలిసి గన్ని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలుగుదేశం - జనసేన శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో 21 నియోజకవర్గాలలో జనసేన, మరోపది అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి పోటీ చేస్తున్నాయి.
చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నేతలు టిక్కెట్లు దక్కక అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళలో చాలామంది జనసేన - బిజెపి అభ్యర్థులకు మనస్పూర్తిగా సహకరించడం లేదు.. కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అటు ఏలూరు పార్లమెంటుకు టిడిపి నుంచి పోటీ చేస్తున్న పుట్టా మహేష్ కు.. ఇటు ఉంగుటూరు నియోజకవర్గం లో జనసేన నుంచి పోటీ చేస్తున్న ధర్మరాజుకు మధ్య కూడా గని సమన్వయం చేస్తూ నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఏది ఏమైనా గన్నిలా ప్రతి ఒక్కరు పొత్తుధర్మం పాటించి కూటమి అభ్యర్థులకు సపోర్ట్ చేస్తే కచ్చితంగా కూటమి అంచనాలకు మించిన ప్రదర్శన చేయటం ఖాయం.. కానీ ప‌లు నియోజకవర్గాల‌లో ఇలా మనస్ఫూర్తితో పని చేసే నాయకులు లేక కూటమికి చాలా చోట్ల కష్టాలు తప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: