గులాబీ బాస్ కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. కొద్దిరోజులుగా సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు కేసీఆర్ ఈ పర్యటనకు బయలుదేరుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో రేపు కేసీఆర్ పర్యటిస్తున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా నుండి కేసిఆర్ ఈ యాత్రను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో నీటి ఎద్దడి కారణంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అంచనాలు ఉన్నాయి.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రైతులకు ఎలాంటి భరోసా లేకపోవడం... రైతు భరోసా పథకం రైతులందరికీ అందకపోవడం, అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చేయకపోవడంతో కేసీఆర్ వాటినే విమర్శాస్త్రాలుగా ఉపయోగించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనతో కేసిఆర్ సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డికి పేద రైతుల ఆర్తనాధాలు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. రైతుబంధు ఇచ్చామని మంత్రులు చెబుతున్నారని... కానీ తమకు రైతుబంధు అందలేదని రైతులు చెబుతున్నారని అంటున్నారు.
ఇలాంటి సమయంలో రంగంలోకి దిగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు కూడా కేసీఆర్ పర్యటన ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సభలు సమావేశాలు నిర్వహిస్తే కేవలం రాజకీయ లబ్ధి కోసం వెళ్ళినట్టు ఉంటుంది. కానీ రైతులను క్షేత్రస్థాయిలో వెళ్లి పరామమర్శించడం ద్వారా బీఆర్ఎస్‌కు లోక్ సభ ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు, కేటీఆర్ సైతం జిల్లాలలో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పై విమర్శాస్త్రలు ఎక్కుపెడుతున్నారు. రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.