గోదావ‌రి: ఆయ‌న పోటీ చేసే పార్టీకి ఓట‌మే.. ఈ బ్యాడ్ సెంటిమెంట్ నాలుగోసారైన బ్రేక్ చేస్తాడా..!

RAMAKRISHNA S.S.
జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్ సభ స్థానాల్లో ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కేంద్రంగా ఉన్న‌ కాకినాడ ఒకటి. సామాజిక పరంగా కాపు అభ్యర్థులకు ఎక్కువుగా ప్ర‌ధాన పార్టీలు సీట్లు ఇస్తూ వ‌స్తుంటాయి. ఇక్క‌డ నుంచి గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ మూడు పార్టీల త‌ర‌పున పోటీ చేస్తూ వ‌స్తున్నారు కాపు నేత చ‌ల‌మ‌ల శెట్టి సునీల్‌. 2009లో ప్ర‌జారాజ్యం - 2014లో వైసీపీ - 2019 లో టీడీపీ నుంచి ఇలా వ‌రుస‌గా మూడు సార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేస్తూ ఓడిపోతూ వ‌స్తున్నారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతోనే ఎంపీ అయ్యే అవకాశాల్ని కోల్పోయార‌నే చెప్పాలి.
ఇప్పటికే మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున బరిలోకి దిగి మూడు సార్లు ఓడిపోయిన ఆయ‌న నాలుగోసారి పోటీలో ఉన్నారు. అందులోనూ వైసీపీ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. 2014లో తాను పోటీ చేసిన వైసిపి నుంచి రెండోసారి బరిలోకి దిగుతుండ‌డం విశేషం. వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోవ‌డంతో ఈ సారి ఎలాగైనా గెల‌వాల‌ని సునీల్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.
మూడు సార్లు వ‌రుస ఓట‌ముల‌తో ఈ సారి ఎన్నికల్లో అవకాశాలు కలిసి వస్తాయని ... సానుభూతి కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఈ పార్ల‌మెంటు నియెజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో తుని - ప్రత్తిపాడు - పిఠాపురం - కాకినాడ రూరల్ - కాకినాడ సిటీ - పెద్దాపురం - జగ్గంపేట స్థానాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికిప్పుడు వైసీపీ ఖ‌చ్చితంగా గెలుస్తుంద‌ని.. భారీ మెజార్టీ సాధిస్తుంది అని చెప్పగలిగే నియోజకవర్గం ఒక్క‌టి కూడా లేదు.
వైసీపీ వేవ్‌లోనే వీరు అంతంతమాత్రం మెజార్టీలతో గెలిచారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయడంతో పాటు జగ్గంపేట, ప్రత్తిపాడుల్లో వైసీపీ అభ్యర్థులను మార్చడంతో ఆ నియోజకవర్గాల్లో రాజకీయం మారిపోయింది. పెద్దాపురంలో వైసీపీ వేవ్ లోనూ టీడీపీ నుంచి మాజీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప గెలిచారు. గ‌త 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ, జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కలిపితే… వైసీపీకి అసలు ఆశలు ఉండవు.
జ‌న‌సేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. కూట‌మి నేప‌థ్యంలో ఆయ‌న స్ట్రాంగ్ క్యాండెట్ గానే ఉన్నారు. ఇక కాకినాడ పార్ల‌మెంటు ప‌రిధిలో ఓ ప్ర‌చారం కూడా న‌డుస్తోంది. ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేయడం సునీల్ హాబీ అనే సెటైర్ ఇప్పటికే కాకినాడలో వినిపిస్తోంది. నాలుగో సారి కూడా ఆయనకు అదృష్టం కలసి రాకపోవచ్చన్న ప్ర‌చార‌మే ఎక్కువుగా న‌డుస్తోంది. మ‌రి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను త‌ట్టుకుని ఈ సారి అయినా సునీల్ గెలుస్తాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: