ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం నాడు(మార్చి 16, 2024) విడుదల చేసింది ఈసీ. 4 వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ ని నిర్వహించి, ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల తోపాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18 వ తేదీన వెలువడుతుంది. ఏప్రిల్ 25 దాకా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు.ఏప్రిల్ 26 వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్ 29 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. మే 13 వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4 వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. జూన్ ఆరు నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఈ సందర్బంగా X ద్వారా స్పందించారు.
ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ విషయమై మోదీ ట్వీట్ చేస్తూ.. 'ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. కేంద్ర ఎన్నికల కమిషన్ 2024 లోక్ షభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. సుపరిపాలనతో పాటు పలు రంగాల్లో సేవలను అందించడంలో మా ట్రాక్ రికార్డ్ ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాము' అంటూ మోదీ వచ్చే ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు సంవత్సరాలుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజుకోసమేనని అన్నారు.ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. జగన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.. ఇకపోలింగే మిగిలింది అని అన్నారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఇక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని బాబు అన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదామని, ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులేనని చంద్రబాబు నాయుడు X ద్వారా స్పందించారు.