అమరావతి : సీనియర్ తమ్ముళ్ళలో టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya


రెండోజాబితా రిలీజైనా సీనియర్ తమ్ముళ్ళకి అయోమయం తప్పటంలేదు. అయోమయం అనేకన్నా టెన్షన్ పెరిగిపోతోందంటే బాగుంటుంది. ఎందుకంటే తాజాగా ప్రకటించిన రెండోజాబితాలో 34 మందికి చంద్రబాబునాయుడు టికెట్లు ప్రకటించారు. మొదటిజాబితాలో 94 మందికి టికెట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండుజాబితాల్లో కలిపి 128 మందికి టికెట్లు ప్రకటించినట్లయ్యింది. అంటే దాదాపు రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే తమ్ముళ్ళను ప్రకటించేసినట్లే అనుకోవాలి.



ఎలాగంటే టీడీపీ 128 సీట్లలో పోటీచేస్తుంటే మిత్రపక్షాలు బీజేపీ, జనసేన 31 నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నాయి. కాబట్టి  టీడీపీలో చాలా సీట్లు ఖాయమైపోయినట్లే. అంటే రెండుజాబితాల్లో కలిపి చాలామంది సీనియర్ల పేర్లు కనబడటంలేదు. కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, బోడె ప్రసాద్, దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పీ గన్నవరం లాంటి సీట్లు పెండింగులో ఉన్నాయి. బహుశా ఈ సీట్లలో అభ్యర్ధులను కూడా తొందరలోనే ప్రకటించేసే అవకాశముంది. మిగిలిన 16 నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల రెండు మూడు పేర్లను పరిశీలిస్తున్నారు. కొన్నిచోట్ల సీనియర్లు ఇతరులకు టికెట్లు ఇవ్వటాన్ని అంగీకరించటంలేదు.



మొత్తంమీద సుమారు 16 మంది సీనియర్లలో అయితే టెన్షన్ పెరిగిపోతోందన్నది నిజం. టికెట్లు ఇస్తారో ఇవ్వరో తెలీదు, ఇతర నియోజకవర్గాలకు పంపుతారో తెలీక వీళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది. గంటా, బోడె, దేవినేని లాంటి వాళ్ళు టికెట్లు దక్కకపోతే చంద్రబాబుకు ఎదురుతిరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. పెనమలూరులో బోడెకు టికెట్ ఇవ్వలేకపోతున్నట్లు చంద్రబాబు ఫోన్ చేసినట్లు సమాచారం. దాంతో ప్రసాద్ బాగా మండిపోతున్నారట. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు పేర్లతో ఐవీఆర్ఎస్ పద్దతిలో సర్వేలు చేయిస్తున్నారు.



ఇలాంటి సర్వేలు నేతల్లో అయోమయాన్ని పెంచేస్తోంది. పీ గన్నవరంలో రాజేష్ కు టికెట్ ఇస్తే పార్టీ జనాలే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోని నేతలు, పీ గన్నవరంలోని మామూలు జనాలు కూడా పార్టీకి వ్యతిరేకంగా విపరీతమైన ఆందోళనలు చేశారు. ఈ ఒత్తిడికి తట్టుకోలేక స్వయంగా రాజేషే తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాల్సొచ్చింది. అయితే ఆ నియోజకవర్గంలో కూడా ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. మొత్తానికి తొందరలోనే అభ్యర్ధులను ఫైనల్ చేసేయటం ఖాయమనే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: