అమరావతి : టీడీపీ సీట్లపైనే జగన్ గురి

Vijaya


రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా 144 సీట్లపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. 144 సీట్లపైనే ఎక్కువ దృష్టి ఎందుకు  పెట్టారంటే ఈ సీట్లలో టీడీపీ పోటీచేస్తున్నది కాబట్టే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో జనసేన 21 సీట్లు, బీజేపీ 10 నియోజకవర్గాల్లో పోటీచేస్తుంటే మిగిలిన 144 స్ధానాల్లో తమ్ముళ్ళు పోటీచేస్తున్నారు. అలాగే 25 పార్లమెంటు సీట్లలో బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీచేస్తుంటే మిగిలిన 17 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీలో ఉంది.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ పోటీచేయబోయే 144 సీట్లలో మ్యాగ్జిమమ్ గెలుచుకోవాలన్న విషయంపైనే జగన్ దృష్టిపెట్టారట. చాలారోజులుగా 175కి 175 సీట్లూ వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్ పదేపదే అంటున్నారు. అయితే పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచేందుకు మాత్రమే కాని సాధ్యంకాదని అందరికీ తెలుసు. అందుకనే  పార్టీవర్గాల అంచనా ప్రకారం టీడీపీ పోటీచేస్తున్న సీట్లలో మినిమం 90 నియోజకవర్గాలను గెలుచుకోవాల్సిందే అని జగన్ టార్గెట్ పెట్టుకున్నారట. జనసేన, బీజేపీ పోటీచేసే సీట్లలో మెజారిటి వైసీపీ ఖాతాలో పడతాయని జగన్ అనుకుంటున్నారట.



ఇపుడు సీట్లు మాత్రమే డిసైడ్ అయ్యాయి. సీట్లలో అభ్యర్ధులను కూడా కూటమి ప్రకటిస్తే అప్పుడు మరికాస్త క్లారిటి వస్తుందని అధికారపార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన  ప్రకటించిన 99 సీట్లలో చాలాచోట్ల గొడవలవుతున్నాయి. జనసేన పోటీచేయబోయే సీట్లలో తమ్ముళ్ళు గోలచేస్తున్నారు. అలాగే టీడీపీ పోటీచేయబోయే నియోజకవర్గాల విషయంలో జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పంచాయితీలను తీర్చలేకే చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. అలాంటిది మధ్యలో బీజేపీ కూడా దూరింది. దాంతో మూడుపార్టీల మధ్య వివాదాలు మరింతగా పెరగటం ఖాయం.



బీజేపీ పోటీచేయబోయే 10 సీట్లలో మూడింటిని జనసేన నుండి మిగిలిన ఏడు సీట్లను టీడీపీ నుండి లాక్కున్నది. దాంతో కమలంపార్టీపై రెండు పార్టీల్లోని నేతలు మండిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో 5.6 శాతం ఓట్లు తెచ్చుకున్న జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్లలో పోటీచేస్తోంది. అరశాతం ఓట్లుకూడా తెచ్చుకోలేకపోయిన బీజేపీ 6 లోక్ సభ, 10 అసెంబ్లీల్లో పోటీచేస్తుండటమే విచిత్రంగా ఉంది. దీంతోనే పొత్తులు, సీట్ల సర్దుబాట్లలో చంద్రబాబునాయుడును బీజేపీ మానసికంగా ఎంత కుంగదీసిందో అర్ధమైపోతోంది. మరీ పరిస్ధితుల్లో మూడుపార్టీల మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: