మద్యం అవినీతికి బంగారం కోటింగ్‌.. భలే లింకు?

Chakravarthi Kalyan
అది ఒక మద్యం తయారీ కంపెనీ. ఏపీ, తెలంగాణలో ఎక్కువగా అమ్ముడయ్యే ఓ ప్రముఖ బ్రాండు మద్యాన్ని తయారు చేస్తోంది. ఆ కంపెనీకి సంగారెడ్డి లో, మహా రాష్ట్రలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోను మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాలదే గుత్తాధిపత్యం కావడంతో కంపెనీలన్నీ రాజకీయ నాయకత్వాలకు, కొన్ని చోట్ల అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సి వస్తోంది.

ఈ క్రమంలో సదరు డిస్టిల్లరీ యాజమాన్యం, నాయకులకు, అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం ఒ సరికొత్త అక్రమానికి తెర తీసింది. అందుకు ఆ సంస్థ ఎంచుకున్న మార్గం బంగారం దుకాణాలకు జ్వూవెలరీ షాపులకు కమీషన్లు ఎరగా చూపి ఏడాది వ్యవధిలో రూ.340 కోట్లు మేర ముడుపులను డబ్బు రూపంలో నాయకులు, అధికారులకు సమర్పించింది. ఈ ముడుపుల్లో ఎక్కువ భాగం ఏపీలోని ఒక బిగ్ షాట్ కు ముట్టినట్టు సమాచారం.

తెలంగాణలోని ఇద్దరు కీలక అధికారులకు మాత్రం రూ.15 కోట్లకు పైగా సొమ్ము అందినట్లు తెలిసింది. ఒక అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి కూడా డబ్బును సర్దినట్టు తెలుస్తోంది. ఈ డిస్టిలరీ యాజమాన్యం నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకున్న ఆ లంచావతారులు ఎవరు. దీనికి ఇంకా లింకులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు బృందాలు కూపీ లాగుతున్నాయి. మద్యాన్ని తయారు చేసే ఆ డిస్టిలరీ రెండు తెలుగు రాష్ట్రాలకు నెలకు 4లక్షల కేసులు మద్యాన్ని సరఫరా చేస్తుంటుంది.

ఇందులో 3 లక్షల కేసులను ఏపీకి, లక్ష కేసులను తెలంగాణకు పంపిణీ చేస్తోంది. తమ  కంపెనీ సరకును ఎక్కువ మొత్తంలో కొనేలా చేసేందుకు నాయకులకు, అధికారులకు లంచాలు ఇస్తూ వస్తోంది. మడుపుగా ఇవ్వాల్సిన నగదును సమ కూర్చేందుకు డిస్టిలరీ యాజమాన్యం కొన్ని జ్యూవెలరీ షాపులతో కుమ్మకు అయింది. వారికి చెక్కులు ఇచ్చి వారి వద్ద బంగారాన్ని కొన్నట్లు.. అలా కొనుగోలు చేసిన దానిని  తమ డీలర్లకు నజరానాగా ఇచ్చినట్లు ఉత్తుత్తి రికార్డులను సృష్టించింది. ఐటీ అధికారుల దాడుల్లో ఈ వ్యవహారం బయటపడటంతో ఆయా దుకాణాల వారిపై జరిమానా విధించి లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: