గోదావరి : అనవసరంగా నెత్తిన పెట్టుకుంటున్నారా ?

Vijaya

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ అనవసరంగా నెత్తిన పెట్టుకుంటోంది. ఆయనకు లేని ప్రాధాన్యతను అధికారపార్టీ కల్పిస్తోంది. ఉద్యమనేతగా ముద్రగడను చాలామంది కాపులు గౌరవిస్తారు. అదే సమయంలో రాజకీయ నేతగా చాలా తక్కువమంది మాత్రమే ఆదరిస్తారు. ముద్రగడ స్వయంగా పోటీచేస్తే ఇపుడు ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు. ఇదే సమయంలో ఆయనేదైనా ఆందోళనకు పిలిపిస్తే మాత్రం  జనాలు హాజరవుతారు. వాస్తవానికి ముద్రగడ పదేళ్ళుగా క్రియాశీల రాజకీయాల్లో లేరు.



చివరిసారిగా పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తే  వచ్చింది సుమారు 10 వేల ఓట్లు. ఒకరకంగా చెప్పాలంటే ముద్రగడ అనే నేత ఇపుడు డెడ్ వెయిట్ అనే చెప్పాలి. ఈయన ఎవరితోను ఇమడలేరు కాబట్టి ఎవరు కూడా ఈయనతో ఎక్కువకాలం సఖ్యతగా ఉండలేరు. ప్రతిచిన్నదానికి అలగటం, నానా రచ్చచేయటం, లేఖలు రాసి గోలగోలచేయటం లాంటి చర్యలతో ఏ పార్టీ కూడా ఈయన్ను భరించలేని స్ధితికి వెళ్లిపోయింది. వైసీపీలో ఈయన్ను చేర్చుకోవాలని అనుకున్నపుడు చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతు వద్దనే చెప్పారు.



ముద్రగడను భరించటం కష్టమన్నారు. అలాంటిది ఈమధ్యనే ముద్రగడతో టీడీపీ లేదా జనసేనలో చేరబోతున్నట్లు ప్రచార మొదలవ్వగానే వైసీపీ నేతలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. తర్వాత్తర్వాత పై రెండుపార్టీల్లోను ముద్రగడ చేరటంలేదని తేలిపోయిన తర్వాత మళ్ళీ సఫోకేటింగ్ ఫీలవ్వటం మొదదలుపెట్టారు. అలాంటిది ఇపుడు సడెన్ గా ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు అనగానే అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజంపేట ఎంపీ, గోదావరి జిల్లాల సమన్వయకర్త  మిథున్ రెడ్డి వెళ్ళి ముద్రగడతో ఆయనింట్లో భేటీఅయ్యారు.



తాజా పరిణామాలతో ముద్రగడ వైసీపీలో చేరటం ఖాయమైపోయినట్లే అనుకోవాలి. కాకపోతే ఆయన ఎక్కడైనా పోటీచేస్తారా లేకపోతే ప్రచారంవరకే పరిమితమవుతారా అన్నదే తెలీలేదు. ముద్రగడ పాత్ర ఎలాగుండబోతున్నా  అసలాయనను పార్టీలోకి చేర్చుకోవటమే చాలామంది నేతలకు ఏమాత్రం ఇష్టంలేదన్నది వాస్తవం. మరి ముద్రగడ వల్ల వైసీపీకి లాభమా నష్టమా అన్నది భవిష్యత్తే తేల్చాలి.  చివరకు ఏమిజరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: